ప్రస్తుత రోజుల్లో ఎంతో మంది ఉదయం లేవగానే ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో నిమ్మరసం( lemon juice ) కలుపుకుని తీసుకుంటున్నారు.ఆరోగ్యానికి నిమ్మరసం చాలా మేలు చేస్తుంది.
ఇన్ఫెక్షన్లతో పోరాడి రోగ నిరోధక శక్తిని మెరుగుపరచడానికి, అధిక బరువు నుంచి బయటపడడానికి, రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడానికి, చర్మాన్ని అందంగా కాంతివంతంగా మెరిపించడానికి నిమ్మరసం ఎంతో అద్భుతంగా తోడ్పడుతుంది.ఈ క్రమంలోనే దాదాపు ప్రతి ఒక్కరు తమ రెగ్యులర్ డైట్ లో లెమన్ జ్యూస్ ను యాడ్ చేసుకుంటున్నారు.
అయితే ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ అతిగా నిమ్మరసం తీసుకోవడం వల్ల పలు సమస్యలు తలెత్తుతాయి.నిమ్మరసంలో టైరమైన్ అనే అమినో యాసిడ్( Tyramine ) ఎక్కువగా ఉంటుంది.
ఇది అధిక మొత్తంలో శరీరంలోకి వెళ్లినప్పుడు మైగ్రేన్ తలనొప్పికి దారి తీస్తుంది.అలాగే నిమ్మ రసం అతిగా తీసుకుంటే కడుపులో యాసిడ్ ఉత్పత్తి పెరుగుతుంది.
ఇది గుండెల్లో మంట, యాసిడ్ రిఫ్లక్స్‌కు దారితీస్తుంది.గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లక్స్ వ్యాధి( Gastroesophageal reflux disease ) ఉన్న వారిలో ఈ లక్షణాలు మరింత తీవ్ర తరంగా ఉంటాయి.

అధిక మొత్తంలో నిమ్మరసం తీసుకోవడం వల్ల కడుపుకి చికాకు కలిగిస్తుంది.వాంతులు, విరేచనాలు, వికారం, కడుపు నొప్పి వంటి సమస్యలు తలెత్తుతాయి.నిమ్మ రసంలో ఆమ్లత్వం ఎక్కువగా ఉంటుంది.ఎక్కువ మొత్తంలో నిమ్మరసం తీసుకుంటే మీ దంతాల మీద ఎనామిల్ పోతుంది.ఒకవేళ మీకు ఇప్పటికే దంతాల సున్నితత్వం, ఇతర దంత సమస్యలు ఉంటే నిమ్మ రసానికి దూరంగా ఉండటమే మంచిది.

స్టమక్ అల్సర్ సమస్యతో బాధపడేవారు నిమ్మ రసాన్ని పొరపాటున కూడా తీసుకోరాదు.ఎందుకంటే, నిమ్మ రసం అల్సర్ సమస్యను మరింత పెంచుతుంది.కొందరికి సిట్రస్ అలెర్జీ ఉంటుంది.
అలాంటి వారు నిమ్మ రసం తీసుకుంటే పెదవులు, నాలుక లేదా గొంతు వాపు, దురద, దద్దుర్లు వంటి లక్షణాలు ఎదుర్కొంటారు.కాబట్టి, సిట్రస్ అలెర్జీ ఉన్నవారు కూడా లెమన్ జ్యూస్ ను ఎవైడ్ చేయాలి.







