తెలంగాణ ఎన్నికల ఫలితాల తరువాత వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల కాంగ్రెస్ లో ‘కీ రోల్’ పోషించనున్నారా ? ఆమె విషయంలో హైకమాండ్ ప్రత్యేక శ్రద్ద చూపిస్తోందా ? అంటే అవుననే సమాధానాలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి.ఎన్నికల ముందు గత కొన్నాళ్లుగా తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసేందుకు తెగ ప్రయత్నించారు వైఎస్ షర్మిల( YS Sharmila ).
కానీ ఏమైందో తెలియదుగాని ఆ దిశగా అడుగులు పడలేదు.మొదట షర్మిల పార్టీని విలీనం చేసుకునేందుకు కాంగ్రెస్ ( Congress )అధిష్టానం సుముఖత వ్యక్తం చేసినప్పటికీ ఆ తరువాత మాత్రం వెనకడుగు వేసింది.

దాంతో చేసేదేమీ లేక విలీనం అంశాన్ని విరమించుకుని తన పార్టీపైనే ఫోకస్ చేస్తూ వచ్చారామె.తాను పాలేరు నుంచి పోటీ చేయబోతున్నాట్లు ఎన్నికల బరిలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నిలుస్తున్నాట్లు సంకేతాలిచ్చారు కూడా.కానీ అంతలోనే ఎన్నికల రేస్ నుంచి తప్పుకొని కాంగ్రెస్ కు మద్దతు పలికారు, ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే ఛాన్స్ లు కనిస్తుండడంతో ముందు రోజుల్లో కాంగ్రెస్ నుంచి ఆమె పాత్ర ఎలా ఉండబోతుందనే చర్చ జరుగుతోంది.అయితే ప్రస్తుతం వినిపిస్తున్న టాక్ ప్రకారం తెలంగాణలో కాంగ్రెస్( Telangana Congress ) అధికారంలోకి వచ్చిన తరువాత ఏపీపై ఆ పార్టీ దృష్టి సారించే అవకాశం ఉంది.

ప్రస్తుతం ఏపీలో హస్తం పార్టీ పూర్తిగా బలహీన పడింది.ఈ నేపథ్యంలో తిరిగి ఆ పార్టీని బలపరిచేందుకు షర్మిలను రంగంలోకి దింపే అవకాశం ఉందనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.అయితే ఏపీ పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం లేదని తన రాజకీయ జీవితం తెలంగాణలోనే అని షర్మిల ఇప్పటికే చాలాసార్లు స్పష్టం చేశారు.మరి ఏపీ వైపు షర్మిల వెళ్లని పక్షంలో టి కాంగ్రెస్ లో ఆమె పాత్ర ఎంటనేది కూడా చర్చనీయాంశమే.
ఇంకో ఆసక్తికర విషయమేమిటంటే ప్రస్తుతం కాంగ్రెస్ కు మద్దతుగా ఉన్న షర్మిల తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తారా లేదా అనే విషయంపై కూడా ఎలాంటి స్పష్టత లేదు.మరి ప్రస్తుతానికి కాంగ్రెస్ కు మద్దతు ప్రకటిస్తున్న ఆమె భవిష్యత్ లో ఎలాంటి ప్రణాళికలతో ముందుకు సాగుతారో చూడాలి.