తెలంగాణ, కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలో ఉండడంతో ఏపీలోనూ కాంగ్రెస్( Congress ) బలం పుంజుకుంటుంది అనే అంచనాలు అందరిలోనూ ఉన్నాయి. కాంగ్రెస్ ఆగ్రనేతల్లోనూ ఇదే అభిప్రాయం ఉంది.
ఏపీ కాంగ్రెస్ కు అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిలను నియమించిన తర్వాత కాస్తో, కూస్తో కాంగ్రెస్ ఏపీలో ఊపిరి పోసుకుందనే నమ్మకం కాంగ్రెస్ అగ్ర నేతల్లో ఉంది. ఇక షర్మిల కూడా దీనికి తగ్గట్లుగానే దూకుడు పెంచుతున్నారు.
తన సోదరుడు వైఎస్ జగన్ పార్టీ వైసిపి ఇటీవల ఎన్నికల్లో ఘోరంగా ఓటమి చెందడంతో, ఆ ప్రభావంతో కాంగ్రెస్ బలం పుంజుకునే అవకాశం ఉంటుందని షర్మిల( Sharmila ) అంచనా వేస్తున్నారు. దీనిలో భాగంగానే కాంగ్రెస్ కు ఏపీలో హైప్ తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
దీనికి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతిని రాజకీయంగా తమకు అనుకూలంగా మార్చుకునేందుకు షర్మిల ప్లాన్ చేసినట్టుగా కనిపిస్తున్నారు .
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ( Revanth Reddy )విజయవాడలో జరిగే మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ( CM YS Rajasekhar Reddy )75వ జయంతి కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున రాజశేఖర్ రెడ్డి కుమార్తె, ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల అధికారికంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.దీనికోసం తెలంగాణ , ఏపీ తో పాటు, కర్ణాటకకు చెందిన కీలక నేతలు, వైఎస్ తో సాహిత్యం ఉన్న వారందరినీ ఆమె ఆహ్వానించారు.
తన సోదరుడు వైఎస్ జగన్ తో అభిప్రాయ బేధాలు తీవ్ర స్థాయిలో ఉన్న నేపథ్యంలో , రాజకీయంగా బలపడేందుకు షర్మిల ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి కి ఉన్న ఇమేజ్ తనకు అనుకూలంగా మార్చుకునేందుకు కాంగ్రెస్ లో జవసత్వాలు నింపేందుకు షర్మిల ప్రయత్నాలు చేస్తున్నారు.
ఈ రోజు జరిగే రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి కార్యక్రమంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తో పాటు, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క , రాజశేఖర్ రెడ్డితో అనుబంధం ఉన్న మంత్రులు హాజరు కాబోతున్నారు. ఇదే వేదికపై వైఎస్ ఆత్మగా పేరుపొందిన కేవీపీ రామచందర్రావు కూడా హాజరవుతున్నారు.అలాగే కర్ణాటక కాంగ్రెస్ కు చెందిన కీలక నేతలు హాజరవుతున్నట్లు సమాచారం.