ఎట్టకేలకు మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా పాల్వాయి స్రవంతి పేరును కాంగ్రెస్ అధిష్టానం ఖరారు చేసింది.ఇప్పటివరకు అభ్యర్థి ఎంపిక విషయంలో పెద్ద ఉత్కంఠ నడిచింది.
ఈ నియోజకవర్గంలో జరగబోయే ఎన్నికలు అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకం కావడంతో అభ్యర్థి ఎంపిక పై అన్ని పార్టీలు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి.బీజేపీ నుంచి ఇప్పటికే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పోటీ చేస్తుండగా , టిఆర్ఎస్ ఇంకా అభ్యర్థి ఎంపిక విషయంపై కసరత్తు జరుగుతోంది.
కాంగ్రెస్ లోనూ నలుగురు నాయకులు టికెట్ కోసం గట్టి ప్రయత్నాలు చేశారు.

ఈ నలుగురికి ఇంటర్వ్యూ సైతం నిర్వహించారు .దీంతో చాలా రోజులుగా నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది.ఇదిలా ఉంటే పాల్వాయి స్రవంతి పేరును కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించడం వెనుక సీనియర్లు చక్రం తెప్పినట్లు సమాచారం.
తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాత్రం మునుగోడు లో కాంగ్రెస్ అభ్యర్థిగా చలమల్ల కృష్ణారెడ్డి ని ఎంపిక చేయాలని భావించారు.ఈ మేరకు అధిష్టానం వద్ద ఆయన పేరును ప్రకటించేలా రేవంత్ పావులు కలిపారు.
అయితే కాంగ్రెస్ సీనియర్లు మాత్రం పాల్వాయి స్రవంతి పేరును ప్రకటించే విధంగా అధిష్టానం వద్ద లానియింగ్ చేయడంతో ఆమె పేరే ఖరారు అయింది.

ఇప్పటి వరకు అభ్యర్థి రేసులో ఉన్న కైలాష్ కు డిసిసి అధ్యక్షుడిగా అవకాశం కనిపిస్తోంది.ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డికి సీనియర్ నాయకులకు మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. రేవంత్ నిర్ణయాలను సీనియర్లు వ్యతిరేకిస్తూ ఉండడం తో పాటు, ఆయనపై ఫిర్యాదులు చేస్తూ అధిష్టానం వద్ద పంచాయతీలు పెడుతున్నారు.
ప్రతి దశలో పై చేయి సాధించే విధంగా ప్రయత్నిస్తూనే ఉన్నారు.సీనియర్లు ఎంతగా తనపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ అధిష్టానానికి ఫిర్యాదులు చేసినా, రేవంత్ మాత్రం తనదైన శైలిలో ముందుకు వెళుతూ వస్తున్నారు.
ఇక ఎక్కువగా రేవంత్ నిర్ణయానికి అధిష్టానం పెద్దలు అంగీకారం తెలుపుతూ వచ్చినా, మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఎంపిక విషయమై సీనియర్ల ఒత్తిడికే తలోగ్గినట్టే కనిపిస్తోంది.