టిడిపి, జనసేన పార్టీ ల మధ్య సీట్ల సర్దుబాటు వ్యవహారం దాదాపు ఒక కొలిక్కి వచ్చింది.అధికార పార్టీ వైసిపి ఇప్పటికే ఆరు విడతలుగా అభ్యర్థుల జాబితాను ప్రకటించిన నేపథ్యంలో, టిడిపి, జనసేన పార్టీల తరఫున అభ్యర్థులను ప్రకటించేందుకు సిద్ధమైపోయాయి.
పొత్తులో భాగంగా ఈ రెండు పార్టీలు ఎక్కడెక్కడ నుంచి పోటీ చేయాలనే విషయంలో ఒక క్లారిటీకి వచ్చారు.ముఖ్యంగా జనసేనకు కేటాయించబోయే సీట్ల విషయంపై అటు టిడిపి అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) నిన్ననే చర్చించుకున్నారు.
ఈ సర్దుబాటు వ్యవహారం ఒక కొలిక్కి వచ్చింది.జనసేన ఆశించిన స్థాయిలో కాకుండా, తక్కువ సీట్లు ఇచ్చేందుకు చంద్రబాబు పవన్ ను ఒప్పించినట్టుగా కనిపిస్తున్నారు.
చంద్రబాబు తో భేటీ అయిన తరువాత ఈ విషయంపై పవన్ కళ్యాణ్ స్పందించారు.మచిలీపట్నం సిట్టింగ్ ఎంపీ బాలసౌరి( Balashowry ), ఆయన కుమారుడు పార్టీలో చేరిన సందర్భంగా పొత్తుల అంశంపై పవన్ మాట్లాడారు.
ఈ పొత్తులో మనకు కొంచెం కష్టంగానే ఉంటుందని, కానీ అసెంబ్లీలో బలంగా అడుగుపెడతామంటూ పవన్ వ్యాఖ్యానించారు.అన్ని సర్దుకునే ముందుకు వెళ్తున్నామని, జనసేన పోటీ చేసే స్థానాలలో 98% విజయ అవకాశాలు ఉంటాయని పవన్ చెప్పారు.సీట్ల సర్దుబాటు విషయంలో కొంత ఇబ్బందికర పరిస్తితులు ఉంటాయని, కొంతమంది ఈ సీట్ల సర్దుబాటుపై బాధపడే అవకాశం ఉందని, 2024లో కచ్చితంగా టిడిపి, జనసేనలు ఉమ్మడిగా అధికారంలోకి వస్తాయని పవన్ ధీమా వ్యక్తం చేశారు.ఇప్పటికే జనసేనకు టిడిపి కేటాయించే సీట్ల విషయం లో పవన్ కు ఒక క్లారిటీ ఉండడంతో, ఆ సీట్లలో జనసేన గెలుపు అవకాశాలపై సర్వేలు చేయించినట్లు సమాచారం.
ఖచ్చితంగా ఈ నియోజకవర్గాల్లో గెలిచే అవకాశం ఉండడంతో, టిడిపి( TDP ) తాము ఆశించిన స్థాయిలో సీట్లు కేటాయించకపోయినా, టిడిపి తమకు కేటాయించబోతున్న సీట్లలో కచ్చితంగా జనసేన గెలుస్తుందనే ధీమాతో పవన్ ఉన్నారు.ఇక చాలా నియోజకవర్గాల్లో టికెట్లపై ఆశలు పెట్టుకున్న నేతలు అసంతృప్తి వ్యక్తం చేసినా, వారికి జనసేన, టిడిపి ప్రభుత్వం ఏర్పడిన తరువాత కీలకమైన పదవులను ఇస్తామనే సంకేతాలను పవన్ ఇస్తున్నారు.కొంతమంది నాయకులు ఈ పొత్తుల వ్యవహారం పై తరచుగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ, మిగతా క్యాడర్ ను గందరగోళానికి గురిచేస్తున్నారని పవన్ ఆగ్రహంతో ఉన్నారు.పార్టీ గీత దాటే వారి విషయంలో సీరియస్ గానే ఉండాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.