ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ కోర్టు ధిక్కార కేసులో దోషిగా తేలిన విషయం తెలిసిందే.ఈ కేసుకు సంబంధించి ఆయనను దోషిగా తేల్చిన ధర్మాసనం తీర్పును మాత్రం రిజర్వ్ లో పెట్టింది.
తాజాగా ఈ రోజు ఈ కేసులో సంచలన తీర్పు వెల్లడించింది.ఆయన చేసిన కోర్టు ధిక్కార కు జరిమానా గా ఒక్క రూపాయి విధిస్తూ సుప్రీం ధర్మాసనం తీర్పు వెల్లడించడం గమనార్హం.2020 జూన్ 27 మరియు 29 తేదీలలో ప్రస్తుత సిజెఐ ఎస్ ఎ బోబ్డే మరియు గతంలో పని చేసిన నలుగురు సిజెఐలకు వ్యతిరేకంగా ఆయన చేసిన ట్వీట్ లు వివాదాస్పద మయ్యాయి.దీనితో ఈ వ్యాఖ్యలను ‘ధిక్కార మరియు పరువు నష్టం’ వ్యాఖ్యలుగా పరిగణించిన ధర్మాసనం సుమోటో గా స్వీకరిస్తూ అత్యవసరంగా విచారణ చేపట్టింది.
తన వివాదాస్పద వ్యాఖ్యలపై సుప్రీంకోర్టుకు క్షమాపణ చెప్పాలని ధర్మాసనం కోరగా, దానికి 63 ఏళ్ల భూషణ్ ఒప్పుకోకపోవడంతో… ఆయన్ని కోర్టు దోషిగా తేల్చింది.
తన ట్వీట్ల తో కోర్టు ధిక్కార కేసులో బుక్ అయిన ప్రశాంత్ భూషణ్ కు సర్వోన్నత న్యాయస్థానం క్షమాపణలు చెప్పేందుకు అవకాశం ఇచ్చింది.
ధర్మాసనానికి బేషరతుగా క్షమాపణలు చెప్పాలి దానితో ఈ కేసును వదిలేస్తామంటూ మూడు రోజుల గడువు కూడా ఇచ్చింది.మీరు వందల కొద్దీ మంచి పనులు చేసి ఉండొచ్చు.
అలాగని మీరు పది నేరాలు చేస్తామంటే లైసెన్స్ ఇవ్వలేం అని వ్యాఖ్యానించిన కోర్టు క్షమాపణలు చెప్పేందుకు మూడ్రోజుల టైమ్ కూడా ఇచ్చింది.అయితే ప్రశాంత్ భూషణ్ మాత్రం తన మాటలను వెనక్కి తీసుకోలేదు సరికదా తాను చేసిన నేరానికి కోర్టు ఎలాంటి శిక్ష విధించినా గౌరవంగా స్వీకరిస్తాను అంటూ వెల్లడించారు.
దీనితో తీర్పును రిజర్వ్ లో పెట్టిన కోర్టు ఈ రోజు ఆయన ఒక్క రూపాయి జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించింది.
గత కొద్ది రోజులుగా ప్రశాంత్ భూషణ్ కేసు పెద్ద చర్చనీయాంశంగా మారింది.
ఆయనకు ధర్మాసనం ఎలాంటి శిక్ష విదిస్తుంది అంటూ అందరూ ఉత్కంఠ గా ఎదురుచూడగా ధర్మాసనం మాత్రం ఒక్క రూపాయి జరిమానా విధించి తీర్పు వెల్లడించడం విశేషం.అయితే ఈ కేసులో అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ కూడా ప్రశాంత్ భూషణ్‌కి మద్దతుగా నిలవడం గమనార్హం.