ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం అంటే ఇరుకు ఇరుకుగా ఒకరి ఒళ్లో ఒకరు కూర్చున్నట్లు ఉండేది.కానీ ఈ కరోనా మహమ్మారి తో ఇక ఆ ప్రయాణం కొంత మేరకు సుఖవంతం కానుంది.
కరోనా మహమ్మారి తో మనుషుల మధ్య భౌతిక దూరం పాటించాలి అని నిపుణుల హెచ్చరికల మేరకు లాక్ డౌన్ ముగిసిన తరువాత బస్సులు నడిపేందుకు ఏపీ రవాణా శాఖ కసరత్తులు చేస్తుంది.అయితే మనుషుల మధ్య భౌతిక దూరం పాటించడం కోసం అని బస్సుల్లో సీట్లను సర్దుబాటు చేసినట్లు తెలుస్తుంది.
దానికి సంబందించిన మోడల్ ఫోటోలను విడుదల చేశారు.
ఆర్టీసీ అధికారులు సూపర్ లగ్జరీ బస్సులను సమూలంగా మార్చాలని నిర్ణయించారు.
దీని కోసం సీట్ల మధ్య దూరం పెంచారు.గతంలో మాదిరిగా కాకుండా మూడు వరసలు ఏర్పాటు చేసి వరుసలో ఒకే సీటు ఉండేలా చూసుకున్నారు.
దీని ద్వారా భౌతిక దూరం పాటించేందుకు వీలు ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.అయితే ఈ మోడల్‌కు ప్రభుత్వం గనుక పచ్చ జెండా ఊపితే ఇక మిగిలిన బస్సులను కూడా ఇదే విధంగా మార్చివేసి సేవలను ప్రారంభించే అవకాశం ఉంది.
కాగా గతంలో బస్సులో మొత్తం 36 సీట్లు ఉండగా.తాజా మార్పులతో 10 సీట్లు తక్కువగా ఉండనున్నాయి.
దీంతో ఆర్టీసీపై కొంత నష్టాల భారం తప్పదనే వాదనలు వినబడుతున్నాయి.
అయితే ఈ నష్టాన్ని భర్తీ చేసుకునేందుకు చార్జీలు పెంచే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తుంది.
మరి ఇప్పటివరకు అయితే ప్రభుత్వాలు అలాంటివి ఏమి ప్రకటించలేదు కానీ తప్పనిసరిగా ఈ లాక్ డౌన్ ఎఫెక్ట్ ప్రజలపై పడే అవకాశాలు మాత్రం కనిపిస్తున్నాయి.