చిత్రం : రైట్ రైట్ బ్యానర్ : శ్రీ సత్య ఎంటర్టైన్మెంట్స్ దర్శకత్వం : మను నిర్మాత : జె.వంశీ కృష్ణ సంగీతం : జే బి విడుదల తేది : జూన్ 10, 2016 నటీనటులు : సుమంత్ అశ్విన్, పూజ ఝవేరి, కాలకేయ ప్రభాకర్ తదితరులు
ఒకనాటి అగ్రనిర్మాత ఎంఎస్ రాజు వారసుడిగా తెలుగుతెరకు పరిచయమయ్యాడు సుమంత్ అశ్విన్.పేరు మోసిన బ్యానర్, తండ్రి వెనకాల ఉన్నా, ఆశించిన రీతిలో ఇంతవరకు సక్సెస్ కాలేకపోయాడు.మరి రైట్ రైట్ చిత్రం తన ఎదురుచూపులకు తెరదించిందో లేదో చూద్దాం.
కథలోకి వెళ్తే …
ఈ.రవి (సుమంత్ అశ్విన్) పోలీసు కావాలని కలలు కంటాడు.కాని తండ్రి మరణంతో కండక్టర్ గా మారాల్సి వస్తుంది.రవిని గవిటి అనే ఊరికి వెళ్ళే ఎకైక బస్సుకి కండక్టర్ గా నియమిస్తారు.ఆ ఏకైక బస్సుకి డ్రైవర్ శేషు (కాలకేయ ప్రభాకర్).వీరిద్దరూ అదే ఊరిలో అద్దేకుంటారు.
ఆ బస్సులో రోజు ప్రయాణించే కళ్యాణితో (పూజ ఝవేరి) ప్రేమలో పడతాడు రవి.ఇదిలా ఉండగా ఒకరోజు బాగా మద్యం తాగుతాడు శేషు.దాంతో బస్సుని రవి నడపాల్సి వస్తుంది.సడెన్ ఒక వ్యక్తి వచ్చి ఆ బస్సుని గుద్దుకోని పడిపోతాడు.కేసు తమ మెడకి చుట్టుకుంటుంది అనే భయంతో ఆ వ్యక్తిని ఓ జీపు ఎక్కించి హాస్పిటల్ కి పంపిస్తాడు రవి.
యాక్సిడెంట్ అయిన వ్యక్తి సర్పంచ్ విశ్వనాథం (నాజర్) అయిన దేవా.అనుకోకుండా శవమై తేలుతాడు.ఆ నేరం రవి మెడకి చుట్టుకుంటుంది.ఇంతకీ దేవా మరణానికి కారకులు ఎవరు ? రవి ఈ కేసునుంచి ఎలా తప్పించుకున్నాడు అనేది మిగితా కథ.
నటీనటుల నటన గురించి
ఇప్పటివరకు కేవలం లవర్ బాయ్ గా కనిపించిన సుమంత్ అశ్విన్ తొలిసారి ఒక బరువైన పాత్ర చేసాడు.నటనలో మంచి పరిణీతి చూపించాడు.కాలకేయ ప్రభాకర్ ని సరిగా వాడుకోలేకపోయాడు దర్శకుడు.ప్రభాకర్ ఫర్వాలేదు అనిపించినా, ఏదో మిస్ అయినట్టు అనిపిస్తూ ఉంటుంది.పూజ ఝవేరి పాత్రలో చెప్పుకోవడానికి పెద్దగా ఏం లేకపోయినా, అచ్చం మన పక్కింటి అమ్మాయిలానే అనిపించి ఆకట్టుకుంటుంది.
భద్ర పాత్ర పోషించిన వినోద్ కృష్ణన్ లో మంచి ఈజ్ ఉంది.మిగితా పాత్రధారుల గురించి పెద్దగా చెప్పుకోవడానికి ఏం లేదు.
సాంకేతికవర్గం పనితీరు :
జేబీ సంగీతం యావరేజ్ గా ఉంది.శేఖర్ వి జోసెఫ్ ఛాయాగ్రహణం అందంగా ఉంది.
హీరోయిన్ ని బాగా చూపించారు ఆయన.డార్లింగ్ స్వామీ మాటలు ఆకట్టుకోలేదు.ఎడిటింగ్ ఒక్కటి ఫర్వాలేదు.ఎడిటర్ కూడా మిగితావారిలానే పనిచేసుంటే, ఓ అరగంట ఎక్కువ కూర్చోవాల్సి వచ్చేది ప్రేక్షకులు.ఇక దర్శకుడు మను గురించి మాట్లాడుకుంటే, తీసిందే రీమేక్ సినిమా.ఒరిజినల్ సినిమాలో ఉన్న ఫీల్ అంతా చెడగొట్టి ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించాడు.
మనుకి మైనస్ మార్కులే వేయాలి.
విశ్లేషణ :
ఇది మలయాళంలో మంచి సక్సెస్ ను సాధించిన ఆర్డినరి చిత్రానికి రీమేక్.ఆ సినిమా తీసిన దర్శకనిర్మాతలకి ఈ రీమేక్ చిత్రాన్ని చుపించకపోతేనే బాగుంటుంది.ఇరికించిన సన్నివేశాలు, నవ్వు రాని కామెడి సీన్లు, అర్థం లేని కాస్టింగ్ తో అసలు కదలనే కదలదు ఫస్టాఫ్.
ఇంటర్వల్ ఒక ట్విస్ట్ పడగానే సినిమా రోడ్డు మీద దూసుకువెళుతున్నట్టే అనిపించినా, హత్య ఎవరు చేశారన్నది ప్రేక్షకుడు ముందే కనిపెట్టేయడంతో ఎక్కడా కూడా ఆసక్తిగా అనిపించదు.నిడివి తక్కువున్నా, సాగుతూ, సాగుతూ ప్రయాణం ఎప్పుడు పూర్తవుతుందా అని ప్రేక్షకుడు ఎదురుచూడటం మొదలుపెడతాడు.
సినిమా అయిపోగానే హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకుంటాడు.
హైలైట్స్ :
* సుమంత్ అశ్విన్ నటన * లోకేషన్లు * ఇంటర్వల్
డ్రాబ్యాక్స్ :
* ఫస్టాఫ్ * పేలని కామెడి * మాటలు * అనవసరపు సన్నివేశాలు * హంతకుడిని ముందే కనిపెట్టగలిగే స్క్రీన్ ప్లే
చివరగా :
సినిమా మొత్తం ….రాంగ్ రాంగ్
తెలుగుస్టాప్ రేటింగ్ : 1.5/5