సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి రావాలని చాలా సంవత్సరాల నుంచి ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తే భవిష్యత్తులో సీఎం అవుతాడని రాష్ట్రంలో అవినీతి లేని పాలన అందిస్తాడని ప్రజలు భావిస్తున్నారు.
గత కొన్నిరోజుల నుంచి రజనీకాంత్ కూడా రాజకీయాలపై తనకు ఆసక్తి ఉన్నట్టు కీలక ప్రకటనలు చేశారు.డిసెంబర్ 31వ తేదీన పార్టీ గురించి ప్రకటన చేస్తానన్న రజనీకాంత్ ఊహించని విధంగా యూటర్న్ తీసుకున్నారు.
రజనీకాంత్ పైకి కుటుంబ సభ్యుల ఒత్తిడి, ఆరోగ్య సమస్యలు అని చెబుతున్నా వీటితో పాటు యూటర్న్ వెనుక వేరే కారణాలు ఉన్నాయని తెలుస్తోంది.రజనీకాంత్ కొన్నిరోజుల క్రితమే ఒక ప్రైవేట్ ఏజెన్సీతో సర్వే చేయించగా ఆ సర్వే రజనీకాంత్ పార్టీ పెట్టినా 2021 అసెంబ్లీ ఎన్నికల్లో రజనీ పార్టీ పెద్దగా ప్రభావం చూపదని తేలిందట.
ఎన్నికలు జరగడానికి ఎక్కువ సమయం లేకపోవడంతో 20 కంటే ఎక్కువ సీట్లు అయితే రావని ఆ సర్వేలో తేలిందని సమాచారం.

రజనీకాంత్ స్థానికుడు కాకపోవడం వల్ల అక్కడి ప్రజల్లో కొంతమంది రజనీకాంత్ పార్టీకి తమ మద్దతు ఇవ్వమని చెప్పారట.ఒకవేళ పార్టీ పెట్టి రజనీకాంత్ పార్టీ తరపున అభ్యర్థులను పోటీ చేయించినా ఆశించిన స్థాయిలో ఫలితాలు ఉండవని ఘోర పరాజయం చవిచూడాల్సి ఉంటుందని ఆ సర్వేలో తేలినట్టు సమాచారం.కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ నిర్ణయాలకు రజనీకాంత్ తరచూ తన మద్దతు ప్రకటిస్తూ ఉండటం కూడా రజనీకి మైనస్ గా మారిందని తెలుస్తోంది.
ఏడు పదుల వయస్సులో రజనీకాంత్ ఎన్నికల్లో పోటీ చేసి అనుకున్న స్థాయిలో సీట్లు రాకపోతే ఆ ప్రభావం భవిష్యత్తులో నటించబోయే సినిమాలపై కూడా పడే అవకాశం కూడా ఉందని భావించారని సమాచారం.ఈ కారణాల వల్లే రజనీకాంత్ రాజకీయాల విషయంలో యూటర్న్ తీసుకున్నారని వీటికి తోడు ఆరోగ్య సమస్యలు వేధిస్తుండటంతో రజనీకాంత్ యూటర్న్ తీసుకోక తప్పలేదని తెలుస్తోంది.
మరోవైపు రజనీకాంత్ తీసుకున్న నిర్ణయంపై తమిళనాడు రాష్ట్రంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.