ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ బారిన పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండేందుకు భారత ప్రభుత్వం పూర్తి లాక్‌డౌన్ విధించిన విషయం విదితమే.ఈ లాక్‌డౌన్ కారణంగా దేశప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు.
కాగా సినిమా షూటింగ్‌లు, రిలీజ్‌లు అన్నీ కూడా వాయిదా పడటంతో సినీ సెలబ్రిటీలు లాక్‌డౌన్ సమయాన్ని ఇళ్లలోనే గడుపుతున్నారు.
టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ దర్శకుడు రాజమౌళి ఆర్ఆర్ఆర్ చిత్రానికి బ్రేక్ ఇచ్చి ఇంటికే అతుక్కుపోయాడు.
ఇక ఇంట్లో ఉంటున్న సమయంలో ఆయన పలు సినిమాలను చూస్తున్నట్లు చెప్పుకొచ్చాడు.ఈ క్రమంలో ఆస్కార్ అవార్డు గెలుచుకున్న పారాసైట్ అనే సినిమాను తాజాగా రాజమౌళి వీక్షించినట్లు తెలిపాడు.
అయితే ఈ సినిమా గురించి గొప్పగా వినడమే కానీ, సినిమాలో పెద్ద మ్యాటర్ ఏమీ లేదని ఆయన అంటున్నాడు.ఈ సినిమా సగం కూడా చూడకుండానే ఆయనకు చాలా నిద్ర వచ్చినట్లు తెలిపాడు.
ఈ సినిమా చాలా బోరింగ్‌గా ఉండటంతో సినిమాను పూర్తిగా చూడలేకపోయానంటూ ఆయన చెప్పుకొచ్చాడు.దీంతో పలువురు నెటిజన్లు ఆయనతీరుపై మండి పడుతున్నారు.
ఆస్కార్ అవార్డు గెలుచుకున్న చిత్రానికి రాజమౌళి ఇప్పుడు రివ్యూ ఇవ్వడం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు.అటు రాజమౌళి తీసిన బాహుబలి చిత్రంలో కూడా పెద్ద మ్యాటర్ లేదని, అయినా సినిమాను ప్రేక్షకులు ఆదరించారని పలువురు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
ఓ ఫిల్మ్ మేకర్ అయ్యి ఉండి, ఇలా ఓ అవార్డ్ విన్నర్ మూవీ గురించి ఇలా కామెంట్ చేయడం సరికాదని వారు అంటున్నారు.మొత్తానికి రాజమౌళిపై సోషల్ మీడియాలో తెగ ట్రోలింగ్ నడుస్తోంది.