దేశ రాజకీయాల్లో భాజపా ఈ స్థాయిలో విస్తృతి చెందడానికి నరేంద్ర మోడీ లాంటి తిరుగులేని నాయకుడు ఆ పార్టీని లీడ్ చేయడమే ప్రదాన కారణమని చెబుతారు.ఎంతగా అమిత్ షా తెర వెనక మంత్రాంగం నడుపుతున్నప్పటికీ దేశం సుభిక్షమైన చేతుల్లో ఉందన్న నమ్మకాన్ని ఇస్తున్న నరేంద్ర మోడీ లాంటి సమర్ధుడైన నాయకుడు ఉండడం వల్లే బిజెపి ఈ స్థాయి విజయాలు సాధిస్తుంది అన్నది రాజకీయ విశ్లేషకుల మాట .
సరిగ్గా కాంగ్రెస్ ఇదే విషయంలో విఫలమైంది.నిజానికి దశాబ్దాల పాటు దేశాన్ని పరిపాలించిన కాంగ్రెస్కు ఇప్పటికీ ఆయా రాష్ట్రాల్లో బలమైన కార్యకర్తల బలం, దన్నుగా నిలబడే అనుకూల సామజిక వర్గాలు ఉన్నాయి.
అయినప్పటికీ వీటన్నిటిని పూర్తిస్థాయిలో క్రోడీకరించి సమన్వయం చేసుకునే నాయకుడు కాంగ్రెస్ కి ఇంతకాలం కరువయ్యాడు.
ముఖ్యంగా రాహుల్ దేశ రాజకీయాలపై అంత ఆసక్తి లేనట్లుగా వ్యవహరించడం, సోనియాగాంధీకి వయసు పైబడటం, సోనియా కి నమ్మకమైన కోటరీ లా వ్యవహరించిన కీలక నాయకులు వయోభారం తో దూరమవ్వడం తో కాంగ్రెస్ లో నాయకత్వ లోపం కనిపించింది.అయితే ఇంత కాలానికి రాహుల్ పూర్తిస్థాయిలో దేశ రాజకీయాలపై ఆసక్తి చూపించడం తో ఇప్పుడు కాంగ్రెస్ లో కొత్త కళ కనిపిస్తుంది.
తన భారత్ జోడో యాత్ర( Bharat Jodo Yatra ) ద్వారా దేశ యువతకు మధ్యతరగతి వర్గానికి బాగా దగ్గరైన రాహుల్ ఇప్పుడు తన బహిరంగ సభల ద్వారా దేశ ప్రజలకు తన మనసును ఆవిష్కరిస్తున్నారు.కాంగ్రెస్ దేశానికి తీసుకురాబోయే మౌలికమైన మార్పులను దేశానికి అవసరమైన సరికొత్త లక్ష్యాలను రాహుల్ వివరిస్తున్న తీరు ఆయన పూర్తిస్థాయి పరిణితి చెందిన నాయకుడుగా మారుతున్నాడు అన్న సంకేతాలను ఇస్తుంది.కాంగ్రెస్తో దేశ ప్రజలకు ఉన్న అనుబందాలను తిరిగి ప్రజలకు గుర్తు చేస్తున్న రాహుల్ ప్రజలకు పార్టీకి మధ్య ఒక కొత్త వారధిని నిర్మిస్తున్నట్లు చెప్పాలి.
ఇంతకాలం కనిపించని ఒక దూరాన్ని మెయింటైన్ చేసిన కాంగ్రెస్ ఇప్పుడు ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలను కోరుకుంటున్నట్లుగా ఆయన వ్యాఖ్యలు నిరూపిస్తున్నాయి.మరి ఇదే జోష్ ను రాహుల్ మరి కొంతకాలం కొనసాగించగలిగితే మోడీకి ప్రత్యామ్నాయ నాయకుడిగా తనను తాను ఆవిష్కరించుకునే అవకాశం కనిపిస్తుంది.