కరోనా వైరస్
భారతదేశంలో చాప కింద నీరులా విస్తరిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంతో పాటు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు
లాక్‌డౌన్
ను పకడ్బందీగా అమలు చేయాలని నిర్ణయించాయి.దీనితో పాటు విదేశాల నుంచి వచ్చిన వారిపై గట్టి నిఘా ఉంచాలని ఆదేశాలు జారీ చేశాయి.
అయితే వివిధ దేశాల్లో స్థిరపడిన
ఎన్ఆర్ఐ
లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు.విదేశాల నుంచి వచ్చి క్వారంటైన్‌లో ఉండకపోవడంతో పాటు ట్రావెల్ హిస్టరీని దాచేస్తున్నారు.
గత రెండు నెలల నుంచి భారతదేశానికి వచ్చిన వారి వివరాలకు,
క్వారంటైన్
లో ఉన్న వారికి మధ్య పొంతన లేకపోవడంతో కేంద్ర హోంశాఖ అప్రమత్తమైంది.అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను ఎన్ఆర్ఐలను, విదేశాల నుంచి తిరిగొచ్చిన వారి వివరాలను గుర్తించాలని ఆదేశించింది.
మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే పంజాబ్‌కు ఈ ముప్పు ఎక్కువగా ఉంది.ఇక్కడకు అధికారికంగానే లక్షకు పైగా ఎన్ఆర్ఐలు వచ్చినట్లు తెలుస్తోంది.అయితే అనధికారికంగా వీరి సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉండొచ్చని అంచనా.ప్రస్తుతం వీరిని గుర్తించేందుకు పంజాబ్ ప్రభుత్వం వేట ప్రారంభించింది.

ఈ క్రమంలో విదేశాల నుంచి భారతదేశానికి తిరిగొచ్చిన ఎన్ఆర్ఐలు తమ వివరాలను చెప్పని పక్షంలో పాస్‌పోర్టులు, వీసాలు రద్దు చేస్తామని
అమరీందర్ సింగ్
ప్రభుత్వం హచ్చరించింది.1,330 మంది ఎన్ఆర్ఐల చిరునామాలను ప్రభుత్వం గుర్తించలేకపోతోంది.కేంద్ర విదేశాంగ శాఖ ఇచ్చిన వివరాల ఆధారగా ఇంకా 10,000 మంది ఎన్ఆర్ఐల ఆచూకీ తెలియాల్సి ఉంది.ఈ నేపథ్యంలో జనవరి 30 తర్వాత భారతదేశంలో అడుగుపెట్టిన ప్రవాస భారతీయులు, విదేశీ ప్రయాణికులు తమ వివరాలను హెల్ప్‌లైన్ నెంబర్ 112కు ఇవ్వాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది.
రెండు రోజుల్లోగా వివరాలు అందించని వారిపై కఠినచర్యలు తప్పవని హెచ్చరించింది.
ఇందుకు సంబంధించి ప్రభుత్వం ఒక
సెల్ఫ్ డిక్లరేషన్ ప్రొఫార్మా
కూడా రూపొందించింది.
ఇందులో వారి పాస్‌పోర్ట్ నెంబర్, విమానాశ్రయం పేరు, ల్యాండింగ్ తేదీ, పంజాబ్ చేరుకున్న తేదీ వంటి వివరాలను అందించాల్సి ఉంటుంది.అంతేకాకుండా శాశ్వత చిరునామాలు, ప్రస్తుత బస, వసతి పొందుతున్న హోటల్ చిరునామా, వ్యక్తిగత ఫోన్ నెంబర్, ఫిక్స్‌డ్ ల్యాండ్ లైన్ నెంబర్, ఈ మెయిల్ ఐడీ, పంజాబ్‌లో వారు సందర్శించిన ప్రదేశాల వివరాలను కూడా ఇవ్వాల్సి ఉంటుందని ప్రభుత్వం తెలిపింది.

ఎవరైనా ఎన్ఆర్ఐ/ విదేశీ యాత్రికుడు ఉద్దేశ్యపూర్వకంగా ఈ సమచారాన్ని దాచిపెడితే, వారిపై కఠినమైన చర్యలు ఉంటాయని ప్రభుత్వం హెచ్చరించింది.తక్షణం వారి పాస్‌పోర్ట్, వీసాలను రద్దు చేయాల్సిందిగా కేంద్ర విదేశాంగ శాఖకి సిఫారసు చేస్తామని ప్రభుత్వాధికారులు తెలిపారు.కాగా ఎన్ఆర్ఐల తీరుపై
పంజాబ్ ముఖ్యమంత్రి
కెప్టెన్ అమరీందర్ సింగ్ అసహనం వ్యక్తం చేశారు.తమ గ్రామం, నగరంలో ఎవరైనా ప్రవాస భారతీయులు, విదేశీయులు ఉంటే దగ్గరలోని పోలీస్ స్టేషన్‌లో సమాచారం అందించాలని ఆయన కోరారు.