ఖమ్మం :ఎఫ్ సిఐ గోడౌన్ వద్ద గల ఎంబి గార్డెన్స్ లో ఉచిత అంతర్ముఖ యోగ శిక్షణ తరగతులకు ముఖ్యఅతిథిగా పూజ్యశ్రీ భిక్షమయ్య గురూజీ స్వయంగా హాజరై అంతర్ముఖ జ్ఞానాన్ని మరియు యోగ రహస్యాన్ని గురించి చార్ట్ ద్వారా వివరించడంతో పాటు ఎల్.ఇ.
డి.ప్రొజెక్టర్ ద్వారా వీడియోలతో నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి శిక్షణను ఇచ్చారు .గురూజీ స్వయంగా మంత్రాన్ని ఉపదేశించి సమాధి అభ్యాసాన్ని ప్రయోగపూర్వకంగా సాధన చేయించడం జరిగింది .ప్రస్తుతం మానవజాతిలో అసంతృప్తి , అసహనం తారాస్థాయికి చేరుకుందని , దీని మూలంగా మానవుడు సత్యమైన , నిత్యమైన , శాశ్వతమైన ఆనందాన్ని పోగొట్టు కొని అల్పమైన , అనిత్యమైన , అశాశ్వతమైన శారీరక సుఖానికి అలవాటు పడ్డాడని అన్నారు .మేధావు లంతా శారీరక సుఖానికి , ఆనందానికి మధ్యన ఉన్న వ్యత్యాసాన్ని గ్రహించలేక పోతున్నారని వాస్తవానికి ఆనందమనేది మన అంతరంగంలోనే ఉంది , అంతరంగమందలి ఆనందాన్ని గుర్తించడమే ఆధ్యాత్మికత అని తెలిపారు .అందుకు సద్గురువు పర్యవేక్షణలో బ్రహ్మోపదేశం ద్వారా మంత్రాన్ని పొంది , పరిపూర్ణ జ్ఞానాన్ని గురించి శాస్త్రయుక్తంగా అవగాహన గావించుకొని అనుభవం పొందగలిగితే అన్నిరకాల సమస్యలకు పరిష్కారం దొరికింది అన్నారు .
యోగా ద్వారా సంపూర్ణ ఆరోగ్యం , సమర్థత , లౌక్యం , మానసిక ప్రశాంతత , దీర్ఘాయుష్షు , పరిపూర్ణ వ్యక్తిత్వం ఏర్పడి జీవితం ఆనందమయం అవుతుందని , ఇల్లు దేవాలయం అవుతుందని బోధించారు .యోగా ద్వారా వంశపార్యపర్యంగా తల్లిదండ్రుల ద్వారా ఏర్పడిన జీన్సు ను సైతం మార్పు చేసుకోవచ్చునని తద్వారా సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని తెలియజేశారు .ఇది సైన్స్‌కు సైతం సాధ్యపడని విషయం అని ఒక్క యోగ సాధన ద్వారానే సాధ్యం అన్నారు .సుమారుగా 500 మంది పాల్గొని విజయవంతం చేశారు .ఈ కార్యక్రమంలో శ్రీసత్యసాయి ధ్యానమండలి ఖమ్మం శాఖ నిర్వాహకులు గురూజీ కె.చంద్రశేఖరరావు , పెండ్లి శ్రీనివాస్ రెడ్డి , కిలారు శ్రీనివాస్ రావు , కోడుమూరు శ్రీనివాసరావు , స్వరూప , పుష్పలత , లీలావతి తదితరులు పాల్గొన్నారు .