దేశ రాజకీయాల్లో గతంలో ఎన్నడులేని విధంగా బీసీల రాజకీయ చైతన్యం ఎగిసిపడుతోంది.దేశంలో అత్యధిక జనాభా ఉన్న బలహీన వర్గాలు ఆయా రాష్ట్రాల్లో బలమైన శక్తులుగా ఎదిగేందుకు చేస్తున్న పోరాటం మెరుగైన ఫలితాలు ఇచ్చే దిశగా ప్రయాణం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
బలహీన వర్గాలకు చెందిన నరేంద్ర మోదీ దేశ ప్రధానిగా రాణిస్తున్న సందర్భం ఒకవైపు ఐతే …ఆయా రాష్ట్రాల్లో బలంగా ఉన్న బీసీలు రాజ్యాధికార సాధన దిశగా తయారవుతున్న సందర్భం కొంతమేరకు కనిపిస్తోంది.బీసీలు ముఖ్యమంత్రులుగా పనిచేసిన రాష్ట్రాల్లో గతంలో పాలించిన నేతల కంటే మెరుగైన ఫలితాలు సాధించడం బీసీల పాలనా సామార్ధ్యానికి అర్ధంపడుతోంది .ఐతే ప్రధానంగా అత్యధిక బీసీలు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలుగు రాష్ట్రాల్లో జనాభా దామాషా ప్రకారం రాజకీయంగా ఇంకా మెరుగైన అవకాశాలు రాకపోవడం దురదృష్టకరం .బలమైన వర్గాలుగా వారిని చూడకుండా కేవలం ఓటు బ్యాంక్ వర్గాలుగా మాత్రమే వారిని చూడటంతో ఇంతకాలం వారికి సరైన అవకాశాలు దక్కలేకపోయిందన్నది నగ్నసత్యం.
ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో సుమారు 132 కు పైగా బీసీ కులాలు ఉన్నట్లు ఓ అంచనా .మొత్తం జనాభాలో సగానికి పైగా వారిదే అగ్రస్థానం .ఉమ్మడి రాష్ట్రంలో 1983 వరకు ఓ తరహా రాజకీయ పరిణామాలుండేవి.ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్ధాపించిన తర్వాత రాజకీయంగా చేజిక్కిన అవకాశాలతో బీసీలలో బలమైన స్థానిక రాజకీయ చైతన్యం కలిగిందని చెప్పవచ్చు.ఐతే దీనికి ఒక కారణం కూడా ఉంది .1983 వరకు కాంగ్రెస్ కు సాంప్రదాయ ఓటుబ్యాంక్ గా దళిత వర్గాలు అండగా నిలిచేవి.ఈ క్రమంలో చోటు చేసుకున్న కొన్ని అంశాలతో బీసీలు టీడీపీకి అండగా నిలిచిన సందర్భం కనిపించింది.కానీ కాలక్రమేణా 2004 నుండి కొంతమేరకు మెజారిటీ బీసీలు వైఎస్ రాజశేఖర్ రెడ్డి నాయకత్వంవైపు ఆకర్షితులై కొంతమేరకు కాంగ్రెస్ కు అండగా నిలవడం జరిగింది .ఐతే మెజారీటీ శాతం అప్పటి నుండి ఇప్పటి అవశేష ఆంధ్రప్రదేశ్ లో టీడీపీకి దాదాపు 30శాతంకి పైగా ఓటుబ్యాంక్ నిలుస్తుందంటే అది బీసీల పుణ్యమే.ఎన్టీఆర్ టైం నుండి బీసీలలో ఆపార్టీకున్న సాంప్రదాయ ఓటుబ్యాంక్ ను వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో వైసీపీ వారిని తమవైపు తిప్పుకోవడంలో సఫలమవుతున్న సందర్భం ఇపుడు కనిపిస్తోంది.

బలహీన వర్గాలను తమ పార్టీ వైపు మార్చే క్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెండు రకాల ఆలోచన చేయడం జరిగింది.బీసీలను బ్యాక్ బోన్ క్యాస్ట్ గా రూపకల్పన చేయడంలో భాగంగా వారికి అధికార సాధికారత కల్పించడం, రెండు రాజకీయంగా టీడీపీని దెబ్బతీయడం.దీనిలో భాగంగానే అధికారంలోకి రాగానే రాజ్యసభ , ఎమ్మెల్సీ , కార్పొరేషన్ చైర్మన్ల లాంటి కీలకపదవులతో పాటు నామినేటేడ్ పనులో వారికి 50శాతం అవకాశాలు కల్పించి అమలు చేస్తున్నారు .వైసీపీకున్న ఎనిమిది ఎంపీ స్థానాల్లో సగం బీసీలకే కేటాయించడం, స్థానిక సంస్థల్లో సగానికి పైగా వారినే చైర్మన్లు గా ఎంపికచేయడం, ఆలయపాలకమండళ్లులో వారికి అగ్రతాంబూలం ఇవ్వడం వంటి కార్యక్రమాలను దశలవారిగా చేసుకుంటూ ముందుకెళుతున్నారు.56 కుల కార్పొరేషన్లు , వారి అభివృద్ధికి చెందిన కార్పొరేషన్లు ఏర్పాటు చేసి సంచలనం సృష్టించారు.తన క్యాబినెట్ లో కీలకమంత్రి పదవులు కట్టబెట్టి బీసీలను అక్కున చేర్చుకునే కార్యక్రమంలో ముందంజలో ఉన్నారు .వీటిలో రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయనే విమర్శలు ప్రతిపక్షాలు గుప్పిస్తున్నా అధికారంలో వారికి వాటా కల్పించడంలో జరుగుతున్న వాస్తవాన్ని అర్ధంచేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది .

ఎన్టీఆర్ నుండి అండగా ఉన్న బీసీల సాంప్రదాయ ఓటును కాపాడుకోవడంలో చంద్రబాబు ఓకింత ఆలస్యంగానే మేలుకుంటున్నారని చెప్పవచ్చు .ఐతే ఇది ఫలితాన్ని ఇస్తుందా లేదా అన్నది వేచిచూడాల్సిందే.తన హయాంలో 2004కి ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో గానీ , 2014లో అవశేష ఆంధ్రప్రదేశ్ లో గానీ బీసీలకు సరైన రాజకీయ ప్రాధాన్యత ఆ పార్టీలో దక్కలేదనే అసంతృప్తి ఈరోజు మరోరకమైన మార్పులకు దోహదం అవుతున్నట్లు కనిపిస్తుంది.
రానురాను దూరమవుతున్న బీసీలను తిరిగి గాడిలో పెట్టేందుకు బలహీన వర్గాలకు చెందిన సీనియర్ నాయకుడు కళా వెంకట్రావును పార్టీ అధ్యక్షుడు చేసినా .అధికారం కోల్పోయాక మరో బీసీ నేత అచ్చంనాయుడికి అధ్యక్ష బాధ్యతలు అప్పగించిన ఆశించిన ఫలితాలను టీడీపీ అందుకోలేకపోవడానికి కారణం బలహీన వర్గాల్లో వచ్చిన చైతన్యమే.
తమ ప్రత్యర్థి పార్టీయైన వైసీపీ బీసీలకు చేసిన మేలుపై లెక్కలతో ముందుకొస్తుంటే తన హయాంలో చేసిన మేలుపై చంద్రబాబుగానీ ఆయన టీంగానీ సరైన రీతిలో జవాబు చెప్పలేని పరిస్ధితి ఏపీలో కన్పిస్తుంది.బీసీలు అండగా లేకపోతే ఏపీలో అధికారంలోకి రాలేమని భావిస్తున్న రెండు ప్రధాన పార్టీలు వచ్చే ఎన్నికల నాటికి వారిని అక్కున చేర్చుకోనేందుకు సదస్సులు , శంఖారావాలు చేయడానికి సిద్దపడుతున్నారంటే బీసీల ప్రాధాన్యత ఏమేరకు ప్రభావం చూపుతుందో అర్థమవుతుంది .జయహో బీసీ సదస్సు పేరుతో తమ ప్రభుత్వం హయాంలో చేసిన మేలుతో ఆవర్గాల ప్రతినిధులతో ముఖ్యమంత్రి జగన్ విజయవాడలో భారీ సదస్సు నిర్వహించబోతున్నారు.ఇదే రీతిలో చంద్రబాబు కూడా బీసీలతో భారీ కార్యక్రమానికి చేయడానికి సిద్దపడుతున్నారు.