జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) గెలుపు పై చాలా నమ్మకంతో ఉన్నారు .టిడిపి, జనసేన కలిసి ఉమ్మడిగా ఏపీలో అధికారంలోకి వస్తుందని అంచనా వేస్తున్నారు.
ఇప్పటికే నిర్వహించిన అనేక సర్వేల్లో ఈ విషయం తేలిందని, సొంతంగా చేయించుకున్న సర్వేల్లోనూ ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయని ,కాస్త జాగ్రత్తగా వ్యవహారం చేస్తే తమ గెలుపునకు తిరుగు ఉండదని పవన్ లెక్కలు వేసుకుంటున్నారు. దీనిలో భాగంగానే జనసేనకు గట్టిపట్టు ఉన్న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా( East Godavari ) పై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు .ఇక్కడ కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉండడంతో పాటు, జనసేనకు గట్టిపట్టు ఉండడంతో , ఈ జిల్లా లో తమ ప్రభావం ఎక్కువగా ఉంటుందని పవన్ బలంగా నమ్ముతున్నారు .
దీనిలో భాగంగానే మూడు రోజులు పాటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోనే మకాం వేసి పరిస్థితిని పవన్ అంచనా వేయనున్నారు.కాకినాడలో ఈ మేరకు పవన్ బస చేయబోతున్నారు.ఈనెల 27 న కాకినాడకు పవన్ చేరుకుంటారు.28 ,29 ,30 తేదీల్లో నియోజకవర్గాల వారీగా సమీక్షలు చేయమన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో జనసేన( Janasena )కు ఎక్కువ స్థానాలు దక్కుతాయి అనే అంచనా తో టిడిపి తో పొత్తులో భాగంగా ఈ జిల్లాలోని ఎక్కువ సీట్లు పవన్ ఆశిస్తున్నారు.
ఈ మేరకు పార్టీ నేతలు అందరిని సమన్వయం చేసుకుని టిడిపి , జనసేన విజయానికి ఏం చేయాలనే దానిపైన వ్యూహ రచన చేయనున్నారు.గత ఎన్నికల్లో ఎదురైన చేదు అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ముందు నుంచే ఈ జిల్లాలో తమకు తిరుగులేకుండా చేసుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు.
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పర్యటన ముగిసిన తర్వాత , ఉమ్మడి పశ్చిమగోదావరి తో పాటు , మరికొన్ని జిల్లాలోనూ ఇదే విధంగా పార్టీ కీలక నాయకులతో సమావేశాలు నిర్వహించాలని, టిడిపి ,జనసేన పొత్తు ఆవశ్యకతను గురించి పార్టీ కార్యకర్తలకు అర్థమయ్యేలా చెప్పి క్షేత్రస్థాయిలో ప్రజాబలం పెంచుకునేందుకు ఏం చేయాలనే దానిపైన పవన్ దిశా నిర్దేశం చేయనున్నట్లు జనసేన వర్గాలు పేర్కొంటున్నాయి.