రాబోయే సార్వత్రిక ఎన్నికలను చాలా సీరియస్ గా తీసుకున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.అందుకే ఒంటరిగా పోటీ చేయాలనే అంశాన్ని పక్కనపెట్టి, పొత్తుల తో అయినా సరే ఏపీలో అధికారంలోకి రావాలనే పట్టుదలతో పవన్ కల్యాణ్ ఉన్నారు.అందుకే రాజకీయాలను సీరియస్ గా చూస్తున్నారు.ప్రస్తుతం సినిమా షెడ్యూల్ కారణంగా తీరిక లేకుండా ఉండడంతో రాబోయే రోజుల్లో ఇక పూర్తిస్థాయిలో రాజకీయాలపై దృష్టి పెట్టాలని చూస్తున్నారు.ఇదిలా ఉంటే 2024 ఎన్నికల్లో పవన్ తాను పోటీ చేసే నియోజకవర్గం విషయంలోనూ ఇప్పటి నుంచే జాగ్రత్తలు తీసుకుంటున్నారు.2019 ఎన్నికల్లో గాజువాక, భీమవరం నియోజకవర్గాల్లో పోటీ చేసినా ఓటమి చెందారు
ఈ రెండు నియోజకవర్గాల్లోనూ కాపు సామాజిక వర్గం బలంగానే ఉన్నా , వైసీపీ హవా రాష్ట్రమంతా ఉండడంతో పవన్ రెండు చోట్ల ఓటమి చెందారు.దీంతో ఇప్పుడు కాపు సామాజిక వర్గం ఎక్కువ గా ఉన్న నియోజకవర్గాలపై పవన్ దృష్టిసారించారు. ఆ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే తప్పకుండా విజయం దక్కుతుందని నమ్ముతున్నారు.
ఈ క్రమంలోనే తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడ రూరల్, పిఠాపురం నియోజకవర్గాల్లో ఒక స్థానం నుంచి పోటీ చేయాలని చూస్తున్నారు.ఈ రెండు నియోజకవర్గాల్లోనూ కాపు సామాజిక వర్గం ప్రభావం ఎక్కువగా ఉంటుంది.
గెలుపోటములను ప్రభావితం చేసే స్థాయిలో కాపు సామాజిక వర్గం ఉండడంతో, ఈ రెండిటినే పవన్ ఎంపిక చేసుకున్నారట. కాకినాడ రూరల్ నియోజకవర్గం ను పరిగణలోకి తీసుకుంటే , 2009 లో ఈ నియోజక వర్గం ఏర్పడింది.

అప్పుడు జరిగిన ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ నుంచి పోటీ చేసిన కురసాల కన్నబాబు విజయం సాధించారు.2014 ఎన్నికల్లో జనసేన ,టిడిపి , బిజెపి కూటమి తరపున టిడిపి అభ్యర్థిగా పిల్లి అనంతలక్ష్మి పోటీచేసి విజయం సాధించారు .2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి గా పోటీచేసిన కురసాల కన్నబాబు విజయం సాధించారు.ఇక పిఠాపురం నియోజకవర్గం ను పరిగణలోకి తీసుకుంటే 2009 ఎన్నికల్లో ఇక్కడి నుంచి ప్రజారాజ్యం అభ్యర్థిగా పోటీ చేసిన వంగా గీత విజయం సాధించారు.
అలాగే 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి ఎస్ వి ఎన్ ఎస్ వర్మ గెలిచారు.పెండెం దొరబాబు 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచారు.ఇప్పుడు ఈ రెండు నియోజకవర్గాల పైనే పవన్ దృష్టి పెట్టారు.ఇందులో ఒక నియోజకవర్గాన్ని ఫైనల్ చేసుకుని 2024 ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీ చేయాలని చూస్తున్నట్టు జనసేన లోని కీలక వర్గాలే చెబుతున్నాయి.







