ట్రంప్ చర్యలతో ఎన్నో ఏళ్లుగా అమెరికాలో స్థిరపడి అక్కడ పలు ఐటీ కంపెనీలు ఏర్పాటు చేసుకున్న భారతీయ అమెరికన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఆ ఐటీ కంపెనీల పరిస్థితి అంధకారంలో పడిందని వాపోతున్నారు.హెచ్1బీ వీసాల విషయంలో అనుసరిస్తున్న వైఖరితో ఐటీ కంపెనీల పరిస్థితి అనిశ్చితిలో పడిందని ఐటీ సర్వ్ అలయన్స్ ప్రెసిడెంట్ గోపి కందుకూరి అన్నారు.
ఐటీ సర్వ్ అలయన్స్ అమెరికాలోని చిన్న, మధ్య స్థాయి ఐటీ కంపెనీలకు చెందిన అతిపెద్ద అసోసియేషన్.ఇది 2010లో ఏర్పడింది.ఈ అసోసియేషన్ లో దాదాపు 1,000 కి పైగా కంపెనీలు సభ్యులుగా ఉన్నాయి.అందులో చాలా వరకు భారతీయ అమెరికన్లకు చెందినవే.హెచ్1బీ వీసాలపై అమెరికాలో పనిచేస్తున్న వారిపై ట్రంప్ ప్రభుత్వ విధానాలు తీవ్ర ప్రభావం చూపుతున్నాయని కందుకూరి అన్నారు.ప్రస్తుతం హెచ్1బీ వీసాల నిరాకరణ రేటు 40 శాతం దాటిందని, ఫలితంగా చాలామంది ఐటీ నిపుణులు అమెరికా నుంచి వలసపోతున్నారని, ఇది చిన్న ఐటీ కంపెనీలకు చాలా పెద్ద సమస్యగా మరిందన్నారు.
ముఖ్యంగా హెచ్1బీలను ప్రాసెస్ చేయడంతోపాటు తమ వద్ద లేదా క్లయింట్ వద్దే ప్రాజెక్టు పూర్తిచేయించే తమ అసోసియేషన్ కంపెనీల పాలిట ట్రంప్ ప్రభుత్వ విధానాలు తమ కంపెనీలకి ఇబ్బందిగా మారాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.హెచ్1బీ వీసాల విషయంలో యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్‌సీఐఎస్) ప్రభుత్వం ఏర్పాటు చేసిన చట్టాలకు బదులు సొంత నిబంధనలను ఏర్పాటు చేస్తోందని, చట్టాల్లో లేని విధానాలను అవలంభిస్తోందని కిశోర్ కందవల్లి ఆరోపించారు.అయితే ఈ విషయాలపై ఇప్పటికే ఐటీ సర్వ్ అలయన్స్ ఇప్పటికే అమెరికా న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.