బాగా చదువుకొని పెద్ద ఉద్యోగాలు చేస్తున్న వారిని కూడా మోసగాళ్లు ఈజీగా బురిడీ కొట్టించి డబ్బులు దోచేస్తున్నారు.తాజాగా వీరి వలలో ఒక ఎన్నారై సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ చిక్కుకున్నాడు.
అతడి నుంచి మోసగాళ్లు ఏకంగా 10 లక్షల రూపాయలను (సుమారు $13,500 USD) కాజేశారు.వీరు ఎన్నారైకి తమని తాము ఐటీ అధికారులుగా చూపించి మోసగించారు.
వివరాల్లోకి వెళ్తే 45 ఏళ్ల బద్రీ నారాయణన్ తన తల్లిని చూసేందుకు ఇటీవల చెన్నైకి వచ్చాడు.తరువాత విరుగంబాక్కంలోని ఆమె ఇంటికి సమీపంలో ఉన్న ఏటీఎం వద్దకు వెళ్లాడు.
అతను పొరపాటున తన పిన్ నంబర్‌ను రెండుసార్లు తప్పుగా ఎంటర్ చేశాడు.దాంతో సంబంధిత బ్యాంకు అతని ఏటీఎం కార్డ్ బ్లాక్ చేసింది.

ఆ రోజు తర్వాత, నారాయణన్‌కి బ్యాంక్ కస్టమర్ కేర్ డిపార్ట్‌మెంట్ సిబ్బంది అంటూ ఒక అజ్ఞాత నంబర్ నుంచి కాల్ వచ్చింది.ఆ అజ్ఞాత వ్యక్తి ఐటీ సమాచారాన్ని తక్షణమే అప్‌డేట్ చేయాల్సి ఉందని వివరిస్తూ, అకౌంట్ కార్డు వివరాలను అందించాలని నారాయణన్‌ను కోరాడు.నారాయణన్ ఫోన్ చేసిన వ్యక్తికి అడిగిన వివరాలన్నీ అందించాడు.కాల్ చేసిన వ్యక్తి నారాయణన్ ఫోన్‌కు లింక్ పంపగా దానిని కూడా క్లిక్ చేశాడు.

ఫలితంగా మూడు లావాదేవీలలో అతని ఖాతా నుంచి 10 లక్షల రూపాయలు డిడక్ట్ అయ్యాయి.తాను మోసపోయానని తెలుసుకున్న నారాయణన్ తన బ్యాంకుకు వెళ్లాడు.తరువాత పోలీసులకు ఫిర్యాదు చేయగా, ప్రస్తుతం విచారణ జరుగుతోంది.కాగా ఐటీ రంగంలో ఉండి మోసగాళ్ల వలలో పడటం తెలివి తక్కువ తనమే అని చాలామంది కామెంట్లు పెడుతున్నారు.
ఎవరికీ బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వకూడదని హితవు పలుకుతున్నారు.







