అమెరికా ప్రజలను వరుస సమస్యలు తీవ్ర ఆందోళనలోకి నెడుతున్నాయి.ఒక వైపు అమెరికాను చుట్టుముడుతున్న ప్రకృతి వైపరీత్యాలు, మరో వైపు కరోనా పాత, కొత్త వేరియంట్స్ ఇలా ఒకటి తరువాత ఒకటి అమెరికా ప్రజలను వేటాడుతున్నాయి.
ఈ సమస్యలతోనే అల్లాడిపోతున్న అమెరికన్స్ కు తాజాగా మరో కొత్త సమస్య పెద్ద తలనొప్పులు తెచ్చిపెడుతోందట . అమెరికాలోని న్యూయార్క్ సిటీలో ప్రజలు ప్రస్తుతం కరోనా వేరియంట్ ఒమెక్రాన్ కంటే కూడా ఎలుకల సమస్యతో తలలు పట్టుకుంటున్నారట.
ఒమెక్రాన్ కంటే పెద్ద సమస్య కాదు కదా అనుకుంటే పొరపాటే న్యూయార్క్ సిటీలో ఎక్కడ చూసినా ఎలుకలే కనిపిస్తున్నాయట.కేవలం ఒక్క న్యూయార్క్ సిటీలోనే ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 2 మిలియన్స్ ఎలుకలు వీర విహారం చేస్తున్నాయట.
రోడ్లు, డ్రైనేజ్, పార్క్స్, మెట్రో స్టేషన్, షాపులు, ఇళ్ళు ఇలా ఏ ఒక్క ప్రాంతాన్ని వదిలిపెట్టకుండా ఎక్కడ చూసినా ఎలుకల గుంపులే కనిపిస్తున్నాయని ప్రజలు వాపోతున్నారు.షాపుల యాజమాన్యాల నుంచీ ప్రభుత్వానికి ఎలుకలను నివారించమని వినతుల వెల్లువలు వస్తూనే ఉన్నాయట.
దాంతో
న్యూయార్క్ ప్రభుత్వం వేట కుక్కలను రంగంలోకి దించింది.సహజంగా అక్కడి ఇళ్ళ లో ఎలుకలు పట్టుకోవాలన్నా, వేట కుక్కలకే ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు.
కానీ ఇబ్బడి ముబ్బడిగా ఉన్న ఎలుకలను పట్టుకోవాలంటే ప్రస్తుతం ఉన్న వేట కుక్కల వలన ఉపయోగం ఉండదని, ఇవి కేవలం 20 ఎలుకలు మాత్రమే పట్టుకోగలవని అంటున్నారు.దాంతో ప్రభుత్వం వేరే ప్రత్యామ్నాయాల వైపు ఆలోచిస్తోంది.
ఇదిలాఉంటే ఈ ఎలుకల సమస్య పై అక్కడి మేయర్ ఆడమ్స్ ఆందోళన చెందుతున్నారు.ఎలుకలు పట్టుకునేందుకు అధునాతన పరికరాలను వినియోగించి ప్రజలకు సమస్య లేకుండా చేయాలంటూ అధికారులను ఆదేశించారు.