సాధారణంగా మనలో చాలా మందికి నిద్రలో తొడ కండరాలు లేదా కాలి పిక్కలు పట్టేస్తూ ఉంటాయి.అయితే కొంతమందిలో పగటి సమయంలో కూడా ఇలా పెట్టేస్తూ ఉంటాయి.
ఈ విధంగా కాలి కండరాలు పట్టేయటానికి అనేక కారణాలు ఉన్నాయి.దీర్ఘ కాలిక అనారోగ్య సమస్యలు,పెరిగే వయస్సు,పోషకాహార లోపం,వ్యాయామం చేసే సమయంలో తొడ కండరాలు లేదా పిక్కలు పట్టేస్తూ ఉంటాయి.
ఈ సమయంలో భరించరాని నొప్పి ఉంటుంది.ఇప్పుడు చెప్పే చిట్కాలను పాటిస్తే కొంత ఉపశమనం కలుగుతుంది.
తొడ కండరాలు లేదా కాలి పిక్కలు పట్టేసినప్పుడు ఆ ప్రదేశంలో ఐస్ ప్యాక్ ను కొంచెం సేపు ఉంచితే నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది.
కొబ్బరినూనె, ఆలివ్ ఆయిల్, ఆవ నూనెలను సమాన పరిమాణంలో తీసుకోని గోరువెచ్చగా చేసి నొప్పి ఉన్న ప్రదేశంలో రాసి 5 నిముషాలు సున్నితంగా మసాజ్ చేస్తే బిగుసుకుపోయిన కండరాలు సాగి నొప్పి తగ్గుతుంది.
కొబ్బరినూనెలో కొన్ని లవంగాలు వేసి మరిగించాలి.కొంచెం చల్లారాక ఈ నూనెను నొప్పి ఉన్న ప్రదేశంలో రాసి మసాజ్ చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
నీరు తగినంతగా తాగకపోతే డీహైడ్రేషన్ సమస్య వస్తుంది.ఇలా డీహైడ్రేషన్ సమస్య ఉన్నవారిలో కూడా కాలి కండరాలు పట్టేస్తూ ఉంటాయి.
ఇటువంటి వారు తగినంతగా నీరు త్రాగితే ఈ సమస్య నుండి బయట పడవచ్చు.
శరీరంలో సరైన మోతాదులో పొటాషియం లేకపోయినా కాలి కండరాలు పట్టేస్తూ ఉంటాయి.
అలాంటివారు పొటాషియం సమృద్ధిగా ఉన్న ఆహారాలను తీసుకోవాలి.