ఎయిడ్స్ మహమ్మారికి మూలకారణమైన హెచ్ఐవి వైరస్ వ్యాప్తిని కట్టడి చేయటంలో వినూత్న కార్యక్రమాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణా సంస్థ (ఎపిశాక్స్) ముందంజలో వుందని రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ మంత్రి విడదల రజని పేర్కొన్నారు.గుంటూరు మెడికల్ కళాశాలలోని జింకాన ఆడిటోరియంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సోసైటీ (ఏపీ శాక్స్), వాలంటరీ హెల్త్ సర్వీస్ ఆధ్వర్యంలో జరిగిన పీఆర్ఈపీఏఆర్ఈ (ప్రీ ఎక్స్ ప్రోజర్ ప్రోఫిలెక్స్) ఆంధ్రప్రదేశ్, ” ప్రెప్ అవేర్‌నెస్ అండ్ రీచ్-అవుట్ ఇన్ ఆంధ్రప్రదేశ్” ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర వైద్యారోగ్య మరియు కుటుంబసంక్షేమ శాఖ మంత్రి విడుదల రజని, వైద్యారోగ్య, ఫ్యామిలీ వెల్పేర్ స్పెషల్ సెక్రటరీ, ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ కంట్రోల్ ప్రాజెక్టు డైరక్టర్ జీఎస్ నవీన్ కుమార్ తో కలసి పాల్గొన్నారు.
పీఆర్ఈపీ అవేర్‌నెస్ అండ్ రీచ్-అవుట్ ఇన్ ఆంధ్ర ప్రదేశ్ కార్యక్రమంను లాంఛనంగా ప్రారంభించి, ప్రచార గీతం, పోస్టర్లు, అవగాహన మెటీరియల్ ను మంత్రి విడుదల రజని ఆవిష్కరించారు. ఈ సంధర్భంగా జరిగిన సభలో మంత్రి విడుదల రజని మాట్లాడుతూ హెచ్ఐవి వ్యాప్తి నిరోధానికి వినూత్న కార్యక్రమాలు చేపట్టటం ద్వారా ఈ వ్యాధిని కట్టడి చేసేందుకు ముందడుగు వేస్తోందన్నారు.ఇందుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ నియంత్రణా సంస్థ విస్తృతమైన కార్యక్రమాలతో అద్భుతంగా కృషి చేస్తోందని ఆమె ప్రశంసించారు.
2022 జూలై చివరి నాటికి మన రాష్ట్రంలో 3,13,725 పిఎలచ్ఐవిలు ఉన్నట్లు అంచనా వేయగా 2,65,256 మందికి వైరస్ సోకినట్లు గుర్తించామని ఆమె వివరించారు.ఈ 2,65,256 పాజిటివ్ కేసుల్లో 2,02,812 మందికి ఇప్పటికే చికిత్స అందిస్తున్నామని, మరో 62,444 మందికి చికిత్స అందించాల్సి వుందని చెప్పారు.ఈ – మహమ్మారిని కట్టడి చేసే కృషిలో మిగిలిన వారిని కూడా చేరి వారికి చికిత్స అందించేందుకు మనందరం క్రమించాల్సి వుందని ఆమె గుర్తు చేశారు.
హెచ్ఐవి వ్యాప్తి కట్టడికి ఆంధ్రప్రదేశ్ చేపడుతున్న కార్యక్రమాలను నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ నేకో కూడా ఆసక్తిగా గమిస్తోందని, వీటిని జాతీయ స్థాయిలో అమలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోందని అన్నారు.ఎయిడ్స్ వ్యాధికి చికిత్స అందించటంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కొన్ని నెలల పాటు కొనసాగే ఎఆర్టి ఔషధ వినియోగం వంటి విభిన్న పద్ధతులను అనుసరిస్తోందని, దీనిని నేకో సంస్థ జాతీయ కార్యక్రమంగా అమలు చేస్తోందని వివరించారు.
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న నేకోకు ఆమె ధన్యవాదాలు తెలియచేశారు.
దీనితోపాటు కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు.
అంతేకాక జాతీయ ఎయిడ్స్ నియంత్రణా కార్యక్రమం, నేషనల్ వైరల్ హెపటైటిస్ కంట్రోల్ ప్రోగ్రామ్ మధ్య సన్నిహిత సహకారం కూడా కొనసాగుతోందని ఆమె వివరించారు.ట్రాన్స్ జెండర్లు, మహిళా సెక్స్ వర్కర్లు, స్వలింగ సంపర్కులు, మాదకద్రవ్యాలను వినియోగించే వారికి సైతం ప్రభుత్వం అమలు చేస్తున్న వ్యాధి నివారణ కార్యక్రమాలు అందాలన్న ఉ ద్దేశంతోనే తాను ఈ కార్యక్రమ ఆహ్వానాన్ని అంగీకరించానని ఆమెచెప్పారు.
ప్రపంచంలో కొత్తగా వెలుగు చూస్తున్న హెచ్ఐవి ఇన్ఫెక్షన్లలో మూడింట రెండు వంతులు ఈ వర్గాల వారి ద్వారానే వ్యాపిస్తున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారని ఆమె అన్నారు.ఈ వర్గాల వారిలో హెచ్ఐవి వ్యాప్తిని అరికట్టటంపై తక్షణం దృష్టి సారించాల్సిన అవసరం వుందని ఆమె స్పష్టం చేశారు.
హెచ్ఐవి వ్యాప్తి నివారణలో కీలకమైన ఈ వర్గాలతో పాటు ప్రతి ఒక్కరికీ ఈ వ్యాధి నిరోధక కార్యక్రమాలు అందాలని ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి ఆదేశించినట్లు ఆమె చెప్పారు.హెచ్ఐవి వ్యాప్తి నివారణలో స్వచ్చంద సంస్థలు అందచేస్తున్న సహకారం ప్రశంసనీయమైనదని ఆమె అన్నారు.
ట్రాన్స్ జెండర్ల ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రులలో వన్ స్టాప్ సెంటర్లను ఏర్పాటు చేయటం అత్యంత ప్రశంసనీయమైన అంశమని, ఇటువంటి ఏర్పాట్లు దేశంలోనే తొలిసారిగా మన రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఏర్పడటం విశేషమని అన్నారు.
హెచ్ఐవి వ్యాప్తి నిరోధక కార్యక్రమా అమలులో ప్రభుత్వానికి విశేషంగా సహకరిస్తున్న సిడిసి డాక్టర్ మెలిస్సా, ఆమె బృందానికి మంత్రి ధన్యవాదాలు తెలియచేశారు.
కేవలం హెచ్ఐవి నివారణకు మాత్రమే కాక అన్ని రకాల ఆరోగ్య పరిరక్షణా కార్యక్రమాలలో బడుగు వర్గాలకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలన్నది వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా తన లక్ష్యమని ఆమె వివరించారు.పేద కుటుంబాలకు చెందిన నిరుపేదలకు నాణ్యమైన ఆరోగ్య పరిరక్షణా కార్యక్రమాలను అందుబాటులో వుంచేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, ఈ ప్రయత్నాల ద్వారా సార్వత్రిక ఆరోగ్య పరిరక్షణలో మంచి పురోగతి సాధిస్తున్నామన్నారు.
స్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనకు ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిస్తోందని ఆమె చెప్పారు.సంక్షేమ కార్యక్రమాలతో ఆరోగ్య పరిరక్షణా కార్యక్రమాలను బడుగు వర్గాల ముంగిటకు తీసుకెళ్లేందుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారన్నారు.
ముఖ్యమంత్రి నిర్దేశించిన ఈ లక్ష్యాల సాధనకోసమే వార్డు/గ్రామ సచివాలయ వ్యవస్థను ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు.ఇవన్నీ సంక్షేమ, ఆరోగ్య పరిరక్షణ, అభివృద్ధి కార్యక్రమాలకు ఏకీకృత వేదిక లుగా పనిచేస్తున్నాయని ఆమె చెప్పారు.
గ్రామ/వార్డు సచివాలయాలు కేవలం హెచ్ఐవి నివారణ కార్యక్రమాలను మాత్రమే కాక బడుగు వర్గాల ఆరోగ్య పరిరక్షణకు, వారి జీవన ప్రమాణాలను మెరుగుపర్చే అభివృద్ధి సేవలను కూడా అందిస్తున్నాయన్నారు.
ఈ మహమ్మారిని కట్టడి చేసేందుకు నివారణే ప్రధాన ఆయుధమని తాను విశ్వసిస్తున్నాన మంత్రి చెప్పారు.
హెచ్ఐవి నివారణలో ప్రిఎక్స్పోజర్ ప్రొఫిలాక్సిస్ (ప్రెప్) ఒక జీవాయుధంలా అత్యంత సమర్ధవంతంగా పనిచేస్తోందని, ప్రెప్ విధానం ద్వారా హెచ్ఐవి వ్యాప్తి గణనీయంగా తగ్గిందని ఆమె వివరించారు.హెచ్ఐవి నివారణలో ఈ విధానం తమకు, బడుగు వర్గాల వారికి ఒక చోదకశక్తిలా పనిచేస్తోందన్నారు.
ఈ విధానాన్ని మనం సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం వుందని ఆమె అభిప్రాయపడ్డారు.ఆంధ్రప్రదేశ్లో ఎయిడ్స్ నివారణ వ్యూహాలలో ప్రెప్ను భాగంగా చేరుస్తామని ఆమె చెప్పారు.
రాష్ట్రంలో ప్రెప్ అమలు కోసం మార్గదర్శకాలు జారీ చేసిన నేకోకు ఆమె ధన్యవాదాలు తెలియచేశారు.ప్రెప్ విధానంపై క్లయింట్లకు అవగాహన కల్పించి హెచ్ఐవి నివారణలో ఇది సరైన విధానమన్న భావన కలుగ చేయటంపై ఎక్కువగా దృష్టి సారించాలని ఆమె సూచించారు.
ఈ నినాదంతోనే ఈ అవగాహనా సదస్సును ఏర్పాటుచేశామని ఆమె వివరించారు.ప్రెప్పై ప్రజల్లో అవగాహన కలిగించే కార్యక్రమాలకు ఇప్పటికే విహెచ్ఎస్ శ్రీకారం చుట్టిందని, రాష్ట్రంలో ఈ కార్యక్రమాలను పెద్దయెత్తున అమలు చేయాల్సిన అవసరం వుందని ఆమె అన్నారు.
హెచ్ఐవి నివారణలో ఎదురయ్యే సామాజిక, చట్టపరమైన సమస్యలను అధిగమిస్తామన్న విశ్వాసం తనకుందని ఆమె అన్నారు.వ్యవస్థీకృతమైన ఈ అడ్డంకులను అధిగమించేందుకే ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థలో ట్రాన్స్ జెండర్ ఆరోగ్య పరిరక్షణను కూడా భాగం చేయాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నదని ఆమె వివరించారు.
రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి, ఎయిడ్స్ నియంత్రణా సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ జీఎస్ నవీన్ కుమార్ హెచ్ఐవి వ్యాప్తి నివారణలో ప్రెవ్ విధానం అత్యంత కీలకమైనదని చెప్పారు.ఈ అవగాహనా సదస్సుకు హాజరైన వైద్య, నర్సింగ్ విద్యార్థులు ఈ విధానానికి రాయబారులుగా వ్యవహరించాలని ఆయన సూచించారు.
హెచ్ఐవి వ్యాప్తి నివారణ కోసం తాము చేసిన ప్రతిపాదనలకు వెంటనే ఆమోద ముద్ర వేస్తూ మంత్రివర్యులు రజని తమకు అత్యధిక సహకారాన్ని అందిస్తున్నారని ఆయన కృతజ్ఞతలు తెలియచేశారు. ఈ కార్యక్రమంలో నేకో ప్రధాన వైద్యాధికారిణి డాక్టర్ శోభిని రాజన్, హెచ్ఐవి నిరోధక కార్యక్రమాల ఐరాస జాయింట్ డైరెక్టర్ డేవిడ్ బ్రిడ్జర్, యుఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్, భారత్ డైరెక్టర్ డాక్టర్ మెలిస్సా న్యెండక్, విహెచ్ఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ డాక్టర్ జోసెఫ్ డి విలియమ్స్, జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డా.సుమయా ఖాన్, , గుంటూరు మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డా.పద్మావతి, జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రభావతి, మెడికల్ కళాశాల అధ్యాపకులు, జీజీహెచ్ వైద్యులు, స్వచ్చంధ సేవా సంస్థ ప్రతినిధులు, వైద్య విధ్యార్దులు పాల్గొన్నారు.