రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిజామాబాద్ జిల్లా పర్యటనకు హాజరుకానున్న నేపథ్యంలో రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖామాత్యులు వేముల ప్రశాంత్ రెడ్డి సోమవారం సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు.
జిల్లా కేంద్రంలో ఇప్పటికే నిర్మాణం పూర్తి చేసుకున్న సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (నూతన కలెక్టరేట్) భవనాన్ని సెప్టెంబర్ 5వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభోత్సవం చేయనున్నారు.దీంతో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కలెక్టర్ సి.నారాయణరెడ్డి, పోలీస్ కమిషనర్ కేఆర్.నాగరాజు తదితరులతో కలిసి న్యూ కలెక్టరేట్ ను సందర్శించారు.
ప్రారంభోత్సవ ఏర్పాట్ల గురించి ఆయా.శాఖల అధికారులను వివరాలు అడిగి తెలుసుకుని పలు సూచనలు చేశారు.సీ ఎం పర్యటన సందర్భంగా ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు.న్యూ కలెక్టరేట్ ను అందంగా ముస్తాబు చేయాలని అన్నారు.కాగా, న్యూ కలెక్టరేట్ కు చేరువలోనే గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్న క్రమంలో, మంత్రి వేముల సభా స్థలిని సైతం సందర్శించి అక్కడి పరిస్థితులను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.బహిరంగ సభకు వచ్చే వారు వాహనాలను పార్కింగ్ చేసుకునేందుకు అనువైన స్థలాన్ని ఎంపిక చేయాలని పోలీసు అధికారులకు సూచించారు.
ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు.సీఎం పర్యటన నాడు ఒకవేళ వర్షం కురిసినా, నిర్దేశిత కార్యక్రమాలకు అంతరాయం కలుగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లను కూడా సిద్ధం చేసుకోవాలని మంత్రి ప్రశాంత్ రెడ్డి జిల్లా అధికారులకు సూచించారు.
ఆయా శాఖల అధికారులు పరస్పరం సమన్వయంతో పని చేయాలని హితవు పలికారు.ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముందే అన్ని ఏర్పాట్లను పూర్తి చేసుకోవాలని సూచించారు.
అనంతరం జిల్లాకు చెందిన కీలక ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులతో మంత్రి ప్రశాంత్ రెడ్డి సీఎం పర్యటన ఏర్పాట్ల విషయమై చేపట్టాల్సిన చర్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమీక్ష జరిపారు.మంత్రి వెంట జెడ్పి చైర్మన్ దాదన్నగారి విట్ఠల్ రావు, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎమ్మెల్యేలు గణేష్ బిగాల, ఆశన్నగారి జీవన్ రెడ్డి, ఎమ్మెల్సీలు వి.గంగాధర్ గౌడ్, రాజేశ్వర్ రావు, నగర మేయర్ దండు నీతుకిరణ్,రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ ముజీబుద్దిన్, అదనపు కలెక్టర్ చిత్రామిశ్రా, అదనపు డీసీపీ అరవింద్ బాబు, ఏసీపీ వెంకటేశ్వర్లు, వివిధ శాఖల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు ఉన్నారు.