పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ దూకుడు వైఖరి గురించి మనందరికీ తెలిసిందే.ఏ విషయంలోనైనా ముక్కుసూటిగా వ్యవహరించడం మమతా నైజం.
అవసరమైతే కేంద్రంతో కయ్యానికి కాలు దువ్వడానికైనా మమత సిద్ధంగా ఉంటుంది.అయితే తాజాగా మమత సర్కార్ ఈ యేడాది దుర్గా నవరాత్రులకు అనుమతి లేదంటూ ప్రకటించినట్టు ఆ రాష్ట్ర సోషల్ మీడియాలో, వెబ్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి.
ఒక వర్గం మనోభావాలు దెబ్బ తీసేలా ఉన్న ఈ ప్రకటన మమత సర్కార్ కే చెడ్డ పేరు తెచ్చింది.దీంతో మమతా బెనర్జీ వైరల్ అవుతున్న వార్తలపై స్పందించి స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేసింది.
వైరల్ అవుతున్న వార్త గురించి తమ ప్రభుత్వం నుంచి ప్రకటన వచ్చినట్టు ప్రూవ్ చేస్తే బహిరంగంగా వంద గుంజీలు తీయడానికైనా సిద్ధమని ప్రకటన చేశారు.తమ పార్టీ నుంచి, పార్టీ నేతల నుంచి అలాంటి ప్రకటన రాలేదని అన్నారు.

పలు రాజకీయ పార్టీలు దుర్గా పూజ విషయంలో అవాస్తవాలను ప్రచారం చేస్తున్నాయని తెలిపారు.తమ పార్టీ నేతలు దుర్గా పూజ విషయంలో ఎటువంటి సమావేశం ఏర్పాటు చేయలేదని పేర్కొన్నారు.ఎవరైనా తమ పార్టీ నుంచి కానీ, పార్టీ నేతల నుంచి కానీ దుర్గా పూజ రద్దు చేసినట్టు ప్రకటన చేశామని ప్రూవ్ చేస్తే ప్రజల ముందు బహిరంగంగా వంద గుంజీలు తీయడానికి సిద్ధమని పేర్కొన్నారు.
తమ పార్టీ నుంచి ఆ విధంగా ప్రకటన వెలువడకపోయినా సోషల్ మీడియా ద్వారా తప్పుడు ప్రచారం జరుగుతోందని… పోలీసులు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్న వాళ్లను గుర్తించాలని పేర్కొన్నారు.
గతంలో ఎప్పుడూ దుర్గా దేవికి పూజలు చేయని వాళ్లు సైతం తమ పార్టీపై విమర్శలు చేస్తున్నారని మమత ఆవేదన వ్యక్తం చేశారు.