లాక్‌హీడ్ మార్టిన్ వైస్ ప్రెసిడెంట్‌ పదవికి భారతీయ అమెరికన్ రాజీనామా

అమెరికా దిగ్గజ ఆయుధాల తయారీ సంస్థ లాక్‌హీడ్ మార్టిన్ వైస్ ప్రెసిడెంట్ పదవికి భారతీయ అమెరికన్, రక్షణ రంగ నిపుణుడు వివేక్ లాల్ రాజీనామా చేశారు.కుటుంబంతో ఎక్కువసేపు గడిపేందుకే తాను లాక్‌‌హీడ్ మార్టిన్ నుంచి తప్పుకున్నట్లు ఆయన తెలిపారు.

50 ఏళ్ల లాల్ ప్రస్తుతం లాక్‌హీడ్ మార్టిన్‌ ఏరోస్పేస్ స్ట్రాటజీ అండ్ బిజినెస్ డెవలప్‌మెంట్ వైస్ ప్రెసిడెంట్‌గా కీలక పాత్ర పోషిస్తున్నారు.వివేక్ రాజీనామాను సంస్థ గత మంగళవారం ధృవీకరించింది.

లాక్‌హీడ్ మార్టిన్‌కు ప్రాతినిధ్యం వహించడంతో పాటు అంతర్జాతీయ భాగస్వాములతో సంస్థ బంధాన్ని మరింత బలోపేతం చేసినందుకు వివేక్ లాల్‌కు కంపెనీ కృతజ్ఞతలు తెలిపింది.భారత్-అమెరికా రక్షణ ఒప్పందంలో ఆయన కీలకపాత్ర పోషించారని లాక్‌హీడ్‌ ప్రతినిధి ఒకరు గుర్తుచేశారు.

దీనిపై స్పందించిన వివేక్ లాల్.తన కుటుంబంతో ఎక్కువ సమయం గడపాలనే తన నిర్ణయాన్ని అర్ధం చేసుకున్నందుకు ఆయన కంపెనీకి కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

ప్రపంచంలోనే అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో లాక్‌హీడ్ మార్టిన్ భవిష్యత్తును మరింత సుస్ధిరం చేసుకుంటుందని ఆయన ఆకాంక్షించారు.అలాగే భారతదేశ జాతీయ భద్రతకు, స్వదేశీ తయారీని ప్రోత్సహిస్తున్న మేక్ ఇన్ ఇండియా భాగస్వామ్యంలో, అమెరికాతో భారత వ్యూహాత్మక సంబంధానికి ఎఫ్-21 ఉత్తమ పరిష్కారంగా వివేల్ లాల్ అభివర్ణించారు.

ఇండోనేషియా రాజధాని జకార్తాలో జన్మించిన వివేక్ లాల్, ఒక దశాబ్ధం పాటు 18 బిలియన్ డాలర్ల విలువైన ఇండో-యూఎస్ రక్షణ ఒప్పందాలలో ఆయన కీలకపాత్ర పోషించారు.తాజాగా భారత నౌకాదళం కోసం లాక్‌హీడ్ మార్టిన్ నుంచి 24ఎంహెచ్-60ఆర్ మల్టీ రోల్ హెలికాఫ్టర్ల ఒప్పందం జరిగింది.2.6 బిలియన్ డాలర్ల ఈ డీల్‌కు సంబంధించి ఫిబ్రవరిలో ట్రంప్ భారత పర్యటన సందర్భంగా ఒప్పందం కుదిరింది.2017లో జనరల్ అటామిక్స్‌లో స్ట్రాటజిక్ డెవలప్‌మెంట్ విభాగానికి లాల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా వ్యవహరించారు.ఈ సమయంలో నాటోయేతర దేశమైన భారత్‌కు కేటగిరి-1 మానవరహిత వైమానిక వాహనాలను విడుదల చేసేందుకు గాను, వైట్ హౌస్ ఒప్పందం కుదుర్చుకోవడంలో ఆయన కీలకపాత్ర పోషించారు.క్షిపణులను మోసుకెళ్లగల సామర్ధ్యం ఉన్న ఈ యూఏవీలు కేటగిరి-1 పరిధిలోకి వస్తాయి.2000 చివరిలో బోయింగ్ డిఫెన్స్ స్పేస్ అండ్ సెక్యూరిటీకి వైస్ ప్రెసిడెంట్ మరియు ఇండియా కంట్రీ హెడ్‌గా వ్యవహరించిన వివేక్ లాల్ బిలియన్ డాలర్ల విలువ చేసే ద్వైపాక్షిక రక్షణ ఒప్పందాలలో ముఖ్యభూమిక పోషించారు.వీటిలో 4 బిలియన్ డాలర్ల విలువైన 10 సీ-17 స్ట్రాటజిక్ లిఫ్ట్ మిలటరీ ట్రాన్స్‌పోర్ట్ ఎయిర్‌క్రాఫ్ట్, 3 బిలియన్ డాలర్ల విలువైన పీ-8ఐ యాంటీ సబ్‌మెరైన్ ఎయిర్‌క్రాఫ్ట్,.28 అపాచీ హెలికాఫ్టర్లు, 5 బిలియన్ డాలర్ల విలువైన 15 చినూక్‌లు, 200 బిలియన్ డాలర్ల విలువైన 22 హార్పూన్ క్షిపణులు ఉన్నాయి.రెండేళ్ల క్రితం యూఎస్ ఫెడరల్ ఏవియేషన్ అడ్వైజరీ కమిటీలో వివేక్ లాల్‌ నియమితులయ్యారు.2005లో ప్రారంభమైన యూఎస్- ఇండియా ఏవియేషన్ కో ఆపరేషన్ ప్రోగ్రాం వ్యవస్థాపక కో చైర్‌గా కూడా లాల్ వ్యవహరించారు.

Advertisement

తాజా వార్తలు