టిఆర్ఎస్ లో ఈటెల రాజేందర్ హవా చాలా కాలం నడిచింది.కేసీఆర్ , హరీష్ రావు ఈటెల రాజేందర్ ఈ ముగ్గురు ప్రధానంగా హైలెట్ అయ్యే వారు.
ఉద్యమ కాలం నుంచి పార్టీలో కీలకంగా రాజేందర్ కొనసాగడంతో టిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ స్థాయిలో రాజేందర్ కు ప్రాధాన్యం ఉండేది.కానీ రెండోసారి టిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాజేందర్ హవా బాగా తగ్గి పోయింది.
ఇక మంత్రిగా వుండ గానే ఈటెల రాజేందర్ భూ అక్రమాలపై కేసీఆర్ విచారణ చేయించడం , మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయడం వంటివి జరిగాయి. వెంటనే ఆయన బీజేపీలో చేరి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఘన విజయం సాధించారు.
ఇక బీజేపీలో ను రాజేందర్ ప్రాధాన్యం బాగానే కనిపించేది.
కేంద్ర బీజేపీ పెద్దల నుంచి రాష్ట్ర స్థాయి నాయకుల వరకు అంతా రాజేందర్ ను కీలక నాయకుడి గానే గుర్తించారు.
అంతేకాదు , తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం కనుక ఏర్పడితే సీఎం రాజేందర్ అన్న స్థాయిలో ప్రచారం కూడా పార్టీలో జరిగింది.అయితే గత కొంత కాలంగా రాజేందర్ హవా పెద్దగా కనిపించడం లేదు.
ఎక్కువగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పేరు మాత్రమే వినిపిస్తోంది.బండి సంజయ్ టిఆర్ఎస్ ప్రభుత్వం పై దూకుడుగా వ్యవహరిస్తున్నారు.
ఇక సంజయ్ చేసే విమర్శలకు టిఆర్ఎస్ అంతే స్థాయిలో విమర్శలు చేస్తూ ఆయనను అడ్డుకునే ప్రయత్నం చేస్తోంది.అయితే ఒక్కసారిగా సంజయ్ ను టార్గెట్ చేసుకుంటూ ఆయన వ్యాఖ్యలకు టిఆర్ఎస్ స్థాయిలో స్పందించడం వెనుక కేసిఆర్ వ్యూహం చాలానే ఉందట.
సంజయ్ ను ఎక్కువ హైలైట్ చేయడం ద్వారా బీజేపీలోని ఈటెల రాజేందర్ ప్రభావం పెరగకుండా చేయవచ్చని, అదే రాజేందర్ ప్రాధాన్యం బీజేపీలు పెరిగితే రాబోయే రోజుల్లో ఆయన టిఆర్ఎస్ ను టార్గెట్ చేసుకుని తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తారని , అంతే కాకుండా ఆయన సుదీర్ఘకాలం టిఆర్ఎస్ లోనే ఉండడంతో పార్టీకి సంబంధించిన లోటుపాట్లు అన్నీ బాగా తెలుసని, కొన్ని కీలక అంశాల గురించి రాజేందర్ బహిరంగంగా విమర్శలు చేస్తే ఇబ్బందులు ఎదుర్కొంటారని ఆలోచనతోనే ఎక్కువగా బండి సంజయ్ కామెంట్స్ కి స్పందిస్తూ రాజేందర్ ప్రాధాన్యం బీజేపీలో పెరగకుండా కేసీఆర్ రాజకీయ వ్యూహం పన్నినట్లు గా గుసగుసలు వినిపిస్తున్నాయి.