బీఆర్ఎస్( BRS ) లో ఒక వెలుగు వెలిగి ఇటీవల సస్పెన్షన్ కు గురైన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు( Jupalli Krishna Rao ) రాజకీయ అడుగులు ఎటువైపు అనేది ఆసక్తికరంగా మారింది.తనతో పాటు బీఆర్ఎస్ నుంచి బహిష్కరణకు గురైన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి( Ponguleti Srinivas Reddy )తో కలిసి బిజెపి వైపు అడుగులు వేస్తారనే ప్రచారం జరుగుతుండగా , కాంగ్రెస్ నూ మరో ఆప్షన్ గా వారు ఇరువురు చూస్తున్నారు.

పొంగులేటి వ్యవహారాన్ని పక్కన పెడితే , జూపల్లి కృష్ణారావు సస్పెన్షన్ తర్వాత స్పీడ్ పెంచారు.ఈ మేరకు నాగర్ కర్నూల్ జిల్లా , కొల్లాపూర్ లో జూపల్లి తన అనుచరులు , కార్యకర్తలతో ఆయన భేటీ అయ్యారు.తన ఆట ఇప్పుడే మొదలైందని తెలంగాణ మైదానమని, గోల్ కొడితే ప్రగతి భవన్ లో పడుతుందన్నారు.త్వరలోనే మహబూబ్ నగర్ లోని ప్రతి నియోజకవర్గానికి వస్తానని, 14 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ను ఓడించడమే తన లక్ష్యం అంటూ జూపల్లి తన అనుచరుల వద్ద శపథం చేశారు.
తెలంగాణ సాధన కోసం రాజీనామా చేసి పోరాడాను అని, రాష్ట్రం వచ్చాక మళ్ళీ పోరాడాల్సి రావడం బాధాకరమని జూపల్లి అన్నారు.త్వరలోనే బీఆర్ఎస్ అక్రమాలకు అన్ని ఆధారాలతో అందరి బండారం బయటపెతామని హెచ్చరించారు.
బీఆర్ఎస్ తనను సస్పెండ్ చేయడం ఆనందంగా ఉందని, కానీ తాను అడిగిన ప్రశ్నలకు సమాధానం కూడా ఇచ్చి ఉంటే బాగుండేదని జూపల్లి అన్నారు.అలాగే గత మూడేళ్లుగా పార్టీ సభ్యత్వం నమోదు బుక్ కూడా ఇవ్వలేదు అని, తాను బీ ఆర్ ఎస్ లో ఉన్నానా లేదా అనే అనుమానం కూడా వచ్చేదని జూపల్లి అన్నారు.

అయితే జూపల్లి కి బీజేపీ, కాంగ్రెస్, వైఎస్సార్ టీపి నుంచి ఆహ్వానాలు అందుతూ ఉండడం తో, ఆయన ఏ పార్టీలో చేరుతారు అనేది ఆసక్తికరంగా మారింది.అయితే ఏ పార్టీలో చేరాలన్నా.రాజకీయంగా తనకు , తన వర్గానికి ప్రాధాన్యం ఇస్తానని హామీ ఇచ్చే పార్టీ వైపే తన అనుచరులతో చర్చించి అడుగులు వేయాలనే వ్యూహంతో జూపల్లి ఉన్నారట.







