జనసేన పార్టీ ఏకైక ఎమ్మెల్యే గా ఉన్న రాపాక వరప్రసాద్ వ్యవహారం ఆ పార్టీకి మొదటి నుంచి ఇబ్బంది కలిగిస్తూ ఉంది.జనసేన పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్థులందరూ, పవన్ కళ్యాణ్ తో సహా ఓటమి చెందినా రాజోలు నియోజకవర్గం నుంచి రాపాక వరప్రసాద్ గెలుపొంది ఆ పార్టీ పరువు నిలబెట్టారు.
ఇక ఆ ఒక్క ఎమ్మెల్యే తో అసెంబ్లీలో గట్టిగా హడావుడి చేద్దామని మొదట్లో భావించినా, పవన్ ఆయన వ్యవహరిస్తున్న తీరుతో విసుగు చెందారు.పార్టీ నియమ నిబంధనలు, ఏవి పట్టించుకోకుండా అధికార పార్టీ నాయకులతో కలిసి తిరుగుతూ, తమ రాజకీయ విరోధి అయిన ఏపీ సీఎం జగన్ ను పదే పదే పొగుడుతూ ఆయన వస్తున్నారు.
దీంతో చాలా కాలం నుంచే ఆయన్ను పట్టించుకోవడం జనసేన మానేసింది.ఒక దశలో ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారనే ప్రచారం పెద్దఎత్తున జరిగింది.
కానీ సస్పెన్షన్ ఆ తర్వాత తలెత్తే పరిణామాలను గ్రహించిన జనసేన వెనక్కి తగ్గింది.తనను సస్పెండ్ చేసే విషయంలో జనసేన వెనకడుగు వేస్తుంది అని గ్రహించిన రాపాక మరింత దూకుడుగా వ్యవహరిస్తూ తనకు అధిష్టానమే లేదు అన్నట్లుగా ఆయన వ్యవహరిస్తున్నారు.
ఈ వ్యవహారం పవన్ కు ఎలా ఉన్నా, జనసైనికులకు మాత్రం తీవ్ర ఆగ్రహాన్ని కలిగిస్తోంది.ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో జనసైనికులు రాపాకను టార్గెట్ చేసుకుని అనేక విమర్శలకు దిగుతున్నారు.
గతంలోనే ఆయనను పార్టీ సస్పెండ్ చేసింది అని పెద్ద ఎత్తున ప్రచారానికి దిగారు.తాజాగా రాజ్యసభ ఎన్నికల్లో తమ రాజకీయ ప్రత్యర్థిని వైసీపీకి రాపాక వరప్రసాద్ ఓటువేశారు.
తటస్థంగా ఉండాలంటూ అధిష్టానం సూచించినా, రాపాక వైసీపీకి ఓటు వేయడం జనసేనకు ఆగ్రహం కలిగించింది.

ఈ విషయంలో జనసైనికులు స్పందించారు.ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు.కానీ అధికారికంగా జనసేన పార్టీ నుంచి కానీ పవన్ నుంచి కానీ ఎటువంటి ప్రకటన రాకపోవడంతో, ఇదంతా జనసైనికులు ఆగ్రహంతో చేసిన పని అని తేలింది.
ఇప్పుడు కాకపోయినా, మరికొద్ది రోజుల్లో అయినా జనసేన నుంచి రాపాక ని సస్పెండ్ చేయకపోతే తాము ఊరుకునేది లేదంటూ జనసైనికులు ఆగ్రహంతో ఊగిపోతున్నారు.ఎవరు ఎన్ని విమర్శలు చేసినా, తన స్టైల్ తనదే అన్నట్లుగా రాపాక వరప్రసాద్ ముందుకు వెళ్తున్నారు.