ఏపీలో తెలుగుదేశం,జనసేన పార్టీల మధ్య పొత్తు దాదాపు ఫిక్స్ అయినా అధికారికంగా మాత్రం ఖరారు రాలేదు.ఇంకా చర్చలు నడుస్తూనే ఉన్నాయి.
ముఖ్యంగా సీట్ల పంపకాల విషయంలో రెండు పార్టీల మధ్య చర్చలు జరుగుతున్నాయి.బిజెపిని కూడా కలుపుకు వెళ్లాలనే ఆలోచనతో రెండు పార్టీలు ఉండడంతో, మరికొంత కాలం వేచి చూద్దామనే ఆలోచనతో ఉన్నాయి జనసేనకు ( Janasena ) బలమున్న నియోజకవర్గాల్లో టిడిపి ( TDP ) త్యాగానికి సిద్ధమవుతోంది.
ఎక్కువ సీట్లు కేటాయించాలనే ప్రతిపాదన కూడా జనసేన నుంచి ఉంది.అయితే సీట్ల పంపకాల విషయం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ చూసుకుంటారని, వారిద్దరు చర్చించి నిర్ణయం తీసుకుంటారని ఇటీవల జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్( Nadendla Manohar ) ప్రకటించారు.
పవన్ కళ్యాణ్ కూడా ఓ ప్రకటన చేశారు.పూర్తిగా తన నిర్ణయానికి వదిలేయాలని, సర్వే రిపోర్ట్ లో మన పార్టీ కచ్చితంగా గెలిచే అవకాశం ఉన్న సీట్లు మాత్రమే తీసుకుంటానని, ఈ విషయంలో ఎవరు ఎటువంటి ఒత్తిడి చేయవద్దు అని పవన్ చెప్పారు సీట్ల విషయంలో రెండు పార్టీల మధ్య వివాదం ఏర్పడకుండా, పొత్తుకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా, పవన్ ముందుగానే ఈ ప్రకటన చేశారు.

తెలుగుదేశంతో సీట్ల సర్దుబాటు సంగతి పవన్ కళ్యాణ్, చంద్రబాబు తో మాట్లాడుకుంటారు అంటూ చెప్పిన నాదెండ్ల మనోహర్ ఇప్పుడు తెనాలి ( Tenali Constituency ) నుంచి పోటీ చేయబోతున్నానని ప్రకటించేశారు.దీంతో నాదెండ్ల మనోహర్ ప్రకటనపై టిడిపి కూడా షాక్ కి గురైంది.ఈ నియోజకవర్గంలో టిడిపి సీనియర్ నేత ఆలపాటి రాజేందర్ ప్రసాద్ వచ్చే ఎన్నికల్లో పోటీకి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు.2019 ఎన్నికల్లో జనసేన అభ్యర్థిగా పోటీ చేసిన నాదెండ్ల మనోహర్ కు 30 వేల ఓట్లు రాగా, టిడిపి అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ కు 76 వేల కోట్లు వచ్చాయి.ఇప్పుడు జనసేన టిడిపి పొత్తు ఖరారైన తెనాలి నుంచి తానే పోటీ చేయబోతున్నానని నాదెండ్ల మనోహర్ ప్రకటించుకోవడంతో, ఆలపాటి రాజేంద్రప్రసాద్ సంగతేమిటనేది టిడిపిలో చర్చనీ యాంసంగా మారింది.

ఆలపాటి టిడిపిలో సీనియర్ నేత.అంతే కాదు చంద్రబాబుకు సన్నిహితుడుగాను ఆయన గుర్తింపు పొందారు.దీంతో ఆలపాటి పరిస్థితి ఏమిటి ? ఆలపాటిని పక్కన పెట్టేందుకు చంద్రబాబు ఒప్పుకుంటారా అనేది పార్టీలో చర్చనీయాంశంగా మారింది.అయినా పొత్తుల వ్యవహారం తేలకుండానే నాదెండ్ల మనోహర్ టికెట్ ప్రకటించుకోవడంపై టిడిపి కూడా సీరియస్ గా ఉంది.అయితే తెనాలి టికెట్ ప్రకటించుకున్న నాదెండ్ల మనోహర్ జనసేనలో కీలక వ్యక్తి కావడంతో, ఈ విషయంలో టిడిపి ఆచితూచి వ్యవహరిస్తోంది.
నాదెండ్లకు కౌంటర్ ఇద్దామన్నా, ఆ ప్రభావం పొత్తులపై స్పష్టంగా ఉంటుందనే భయము టిడిపిలో నెలకొంది.







