అంతా వాళ్ల చేతుల్లోనే: పాపం వీళ్ల బాధ జగన్ పట్టించుకోవడంలేదా ?

ఏపీ అధికార పార్టీ లో అంతా బాగానే ఉంది అన్నట్టుగా పరిస్థితులు పైకి కనిపిస్తున్నా లోపల మాత్రం సొంత పార్టీ నాయకుల్లో అసంతృప్తి అగ్నిపర్వతంలా మండుతూనే ఉంది.

ముఖ్యంగా పార్టీ సీనియర్ నాయకులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు సొంత పార్టీపై రోజురోజుకు అసమ్మతి గళం వినిపిస్తున్నారు.

తాము ప్రజాప్రతినిధులుగా ప్రజల ఓట్లతో గెలిచినా, పెద్దగా ప్రాధాన్యం ఉండడం లేదని, ప్రజాప్రతినిధులుగా గెలిచినా తమకు ఉన్న కొన్ని హక్కులను కూడా ఉపయోగించుకునేందుకు అవకాశం లేకుండా, మొత్తం పరిపాలన అంతా అధికారుల చేతుల్లో పెట్టేశారని వైసిపి ప్రజాప్రతినిధులంతా గుర్రుగా ఉన్నారు.మొత్తం ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, కమిషనర్ లే చూసుకుంటున్నారని, అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయం చేసుకుని ముందుకు వెళ్లాల్సిన అంశాల్లోనూ వారికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ, ప్రజా ప్రతినిధులను ఉత్సవ విగ్రహాలుగా మార్చేశారనే అభిప్రాయం మెజారిటీ వైసీపీ ప్రజాప్రతినిధుల్లో నెలకొంది.

అన్ని సంక్షేమ పథకాలు అధికారుల ద్వారా ప్రజలకు చేరిపోతుండడంతో తమ దగ్గరకు వచ్చే వారు కరువయ్యారని, కనీసం తమకు ప్రాధాన్యమిచ్చే అధికారులు కూడా కరువయ్యారని వీరంతా కొంతకాలంగా అసంతృప్తితో ఉన్నారు.ద్వితీయ శ్రేణి ప్రజాప్రతినిధులు కాకుండా, ఎమ్మెల్యేలు, కొంతమంది మంత్రులు సైతం ఇదే అభిప్రాయంతో ఉన్నట్లు తెలుస్తోంది.

తాము ప్రజాప్రతినిధులుగా కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి గెలిచినా, ప్రస్తుత పరిస్థితుల్లో ఎటువంటి ఉపయోగం లేకుండా చేశారని, ఇలా అయితే ప్రజల్లో తమకు గుర్తింపు ఏముటుందని, నియోజకవర్గాల్లో వివిధ అభివృద్ధి పనుల నిమిత్తం కానీ, అధికారుల బదిలీల విషయంలో కానీ, ఎక్కడ ప్రజాప్రతినిధుల మాట చెల్లకుండా ఉంటే ఇంకా విలువ ఏమి ఉంటుందనే బాధ వీరు వెళ్లగక్కుతున్నారు.

Advertisement

వీడియో కాన్ఫరెన్స్ సమావేశాల్లోనూ, అధికారులకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ, వారి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటూ, తమను పక్కన పెట్టేసినట్టుగా వ్యవహరిస్తున్నారని, నియోజక వర్గాల సమస్యలను చెప్పుకునేందుకు అధినేత అవకాశం ఇవ్వడం లేదని, ఇలా రకరకాల కారణాలు చూపిస్తూ, ఎమ్మెల్యేలు చాలామంది తమ అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు.గతంలో నెల్లూరు జిల్లా వెంకటగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి, ఎంపీ రఘురామకృష్ణంరాజు సైతం ఇదే రకమైన ఆరోపణలు చేశారు.అప్పట్లో జగన్ లో కాస్త మార్పు వచ్చినట్టుగా కనిపించింది.

రోజుకు నాలుగైదుగురు ఎమ్మెల్యేలకు తనను కలిసేందుకు అవకాశం కల్పించారు.కానీ అదంతా మూడునాళ్ళ ముచ్చట గానే మిగిలిపోయిందని, చాలా మంది ఎమ్మెల్యేలు వాపోతున్నారు.

క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పథకాలు విషయంలో గాని, లబ్ధిదారుల ఎంపిక వంటి విషయాల్లో అధికారులతో పాటు, తమకు కూడా తగిన ప్రాధాన్యం ఇవ్వాలని వీరంతా జిల్లా ఇంచార్జిలకు, మంత్రులకు సైతం మొరపెట్టుకుంటున్నా,ప్రయోజనం కలగడం లేదనే అసంతృప్తితో ఉన్నారట.

రాజధానిపై నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు..!!
Advertisement

తాజా వార్తలు