నారా లోకేష్ కు రాజకీయ భవిష్యత్తు లేకుండా చేసేందుకు, టీడీపీని కోలుకోని విధంగా దెబ్బతీసేందుకు వైసీపీ ప్రభుత్వం అన్ని రకాలుగా ఏర్పాట్లు చేసుకుంది.మరి కొంత కాలం మాత్రమే చంద్రబాబు యాక్టివ్ గా ఉండే అవకాశం కనిపిస్తోంది.
ఆ తర్వాత పూర్తి బాధ్యతలు ఆయన కుమారుడు లోకేష్ తీసుకోవడం, రానున్న రోజుల్లో వైసీపీ కి పోటీ ఎదురయ్యే అవకాశం ఉండడం, అలాగే ప్రతి విషయంలోనూ, తమను తప్పుపడుతూ ప్రభుత్వ విధానాలని అవహేళన చేస్తూ, చిన్న చిన్న లోపాలను పెద్దగా చూపిస్తూ, సోషల్ మీడియాలో హైలెట్ అయ్యే విధంగా లోకేష్ చేస్తున్న ప్రయత్నాలపై చాలాకాలంగా జగన్ సీరియస్ గానే ఉన్నారు.కాకపోతే సరైన సమయం కోసం వేచి చూస్తూ, లోకేష్ ను ఇరికించేందుకు అన్ని రకాల ఏర్పాట్లను చేసుకుంటూ వస్తున్నారు.
ఈ మేరకు గత టీడీపీ ప్రభుత్వ హయాంలో లోకేష్ పాత్ర తో పాటు అన్ని వ్యవహారాలపైన వైసీపీ దృష్టి పెట్టి లోతుగా దర్యాప్తు చేయిస్తోంది.ఈ మేరకు లోకేష్ ఐటీ శాఖ మంత్రిగా పనిచేసిన సమయంలో, ఐటీ గ్రిడ్ వ్యవహారంలో భారీ ఎత్తున అవినీతికి పాల్పడ్డారనే విషయాన్ని గుర్తించింది.
దీనిపై మరింత లోతుగా దర్యాప్తు చేయించి లోకేష్ అవినీతి పరుడు అనే విషయాన్ని జనాల్లోకి తీసుకెళ్లాలని వైసీపీ ప్రభుత్వం భావిస్తోంది.ఇదే కాకుండా గత టీడీపీ ప్రభుత్వ హయాంలో విజయవాడ దుర్గమ్మ గర్భగుడిలో లోకేష్ ను ముఖ్యమంత్రిని చేసే నిమిత్తం పూజలు చేయించారనే విషయంపైన వైసీపీ దృష్టి సారించింది.
ఈ వ్యవహారాన్ని త్వరలోనే బయటపెట్టేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది. లోకేష్ ను కట్టడి చేయడం ద్వారా మిగతా టీడీపీ నాయకుల్లో భయాందోళనలు కలిగించాలని తమ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై పదే పదే విమర్శలు చేస్తూ వస్తున్న విషయం పైన వైసీపీ సీరియస్ గా దృష్టి పెట్టింది.
అందుకే లోకేష్ విషయంలో మరింత కఠినంగా వ్యవహరించాలని చూస్తోంది.కేవలం క్షుద్ర పూజలు, ఐటీ గ్రిడ్ వ్యవహారమే కాకుండా, మరిన్ని వ్యవహారాల్లో లోకేష్ పాత్ర ఉందని వైసీపీ నమ్మడమే కాకుండా, దానికి సంబంధించిన ఆధారాలను కూడా సేకరిస్తోంది.
అన్ని వైపుల నుంచి లోకేష్ కు రాజకీయ భవిష్యత్తు లేకుండా చేయడంతో పాటు, తనపై గతంలో ఏ విధంగా అయితే అవినీతిపరుడని ముద్రవేశారో ఇప్పుడు అదే ముద్రను లోకేష్ పై వేసేందుకు గట్టిగానే ప్రయత్నాలు మొదలుపెట్టింది.