ఏపీ సీఎం జగన్ రేపు ఢిల్లీకి వెళ్ళిపోతున్నారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తో జగన్ భేటీ కాబోతున్నారు.
అయితే ఈ భేటీ వెనుక కారణాలు చాలానే ఉన్నట్లు తెలుస్తోంది.ప్రస్తుతం కరోనా సమయంలో అన్ని రాష్ట్రాలు వ్యాక్సినేషన్ విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.
ఆ ఇబ్బందుల నుంచి బయట పడేందుకు అన్ని రాష్ట్రాలు ప్రయత్నాలు చేస్తున్నాయి.కేంద్రం పైన విమర్శలు చేస్తున్న తరుణంలో ఏపీ సీఎం జగన్ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖలు రాసి ఈ సమయంలో కేంద్రానికి అండగా నిలబడాలని, కేంద్రం తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉండాలంటూ లేఖలు రాసిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలోనే జగన్ ఢిల్లీ టూర్ పెట్టుకున్నట్లుగా ఒకవైపు వార్తలు వస్తున్నా, తమను పదేపదే అసహనానికి గురి చేస్తూ ప్రభుత్వంపై పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ ఇబ్బందికరంగా రఘురామ కృష్ణంరాజు వ్యవహారం మారింది.
ఈయన వ్యవహారంలో బీజేపీ పెద్దలు వైఖరిని స్పష్టంగా తెలుసుకునేందుకు , ఆయన విషయంలో మోదీ అమిత్ షా వంటి వారు ఏ క్లారిటీతో ఉన్నారనే విషయాన్ని తేల్చుకునేందుకు జగన్ ఢిల్లీ బాట పట్టినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.
రఘురామ విషయంలో బిజెపి పెద్దలు కల్పించుకుని ఆయనను కట్టడి చేయాలని, అవసరమైన సందర్భంలో తాము మీకు అన్ని విధాలా సహకరిస్తున్నారని ఈ విషయంలో తమకు సహకరించి రఘు బెడద లేకుండా చూడాలని జగన్ కోరబోతున్నట్లుగా ను ప్రచారం జరుగుతోంది.

ఇక పనిలో పనిగా ఏపీకి సంబంధించి నిధులు, పోలవరం ప్రాజెక్ట్, వ్యాక్సినేషన్ కొరత , కరోనా కట్టడి తదితర అంశాలపై అమిత్ షా తోనే కాకుండా మరికొంత మంది కేంద్ర మంత్రులతో జగన్ చర్చించేందుకు ఢిల్లీ వెళ్తున్నట్లు తెలుస్తోంది.ఇప్పటికే అమిత్ షా షెడ్యూల్ ఖరారు కావడంతో అన్ని విషయాలలోనూ బిజెపి పెద్దల నుంచి స్పష్టమైన హామీ తీసుకుని ఏపీలో అడుగు పెట్టాలన్నదే జగన్ ఆలోచనగా కనిపిస్తోంది.