ఒకటి కాదు రెండు కాదు.చంద్రబాబు ఏకంగా ఆరు లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డారని తాను ప్రతిపక్షంలో ఉన్నపుడు జగన్మోహన్‌రెడ్డి పదే పదే ఆరోపించారు.
దీనిపై పుస్తకాలు కూడా ప్రచురించారు.తాము అధికారంలోకి వస్తే ఈ అవినీతి బాగోతాన్నంతా తవ్వి తీస్తామని కూడా చెప్పారు.
అధికారంలోకి వచ్చారు.ఆరు నెలలు కూడా గడచిపోయాయి.

కానీ ఇప్పటి వరకూ ఒక్కటంటే ఒక్క ఆరోపణను కూడా నిరూపించలేకపోయారు.రాజధానిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందన్నారు.పోలవరంలో వేల కోట్ల అవినీతి అన్నారు.అమరావతిలో సుజనా చౌదరి వందల ఎకరాలు కొన్నారని ఆరోపించారు.కానీ ఏదీ నిరూపించలేకపోయారు.చివరికి విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లోనూ అవినీతి జరిగిందంటూ వాటిని రద్దు చేయడానికి ప్రయత్నించి కేంద్రం చేతిలో మొట్టికాయలు తిన్నారు.

తాను చెప్పినట్లే అధికారంలోకి రాగానే అన్నింటిపైనా కమిటీలు వేసి, జరుగుతున్న పనులన్నింటినీ ఆపేశారు కానీ.ఆ కమిటీలు ఏం తేల్చాయో మాత్రం ఇప్పటి వరకూ జగన్ సర్కార్ బయటపెట్టలేకపోయింది.వాటికి ఇచ్చిన సమయం ఆరు వారాలు కాగా.ఆరు నెలలైనా ఉలుకూ లేదు.పలుకూ లేదు.నోటిమాటగా అవినీతి ఆరోపణలు చేసి అమరావతి నిర్మాణం ఆగిపోయేలా చేయడం వల్ల రాష్ట్రం ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోందో చూస్తూనే ఉన్నాం.
చంద్రబాబుపై అవినీతి ఆరోపణలే కాదు.ఎన్నికల ముందు జరిగిన జగన్ బాబాయ్ వివేకా హత్య, జగన్‌పై జరిగిన కోడికత్తి దాడి కేసుల విచారణ ఏమైందో కూడా ఎవరికీ తెలియదు.
చంద్రబాబు, లోకేష్‌లే ఈ పని చేశారని ఎన్నికల ముందు వైసీపీ ఆరోపించింది.అదే నిజమైతే ఇప్పుడు అధికారమే చేతిలో ఉంది.నిజంగా బాబు హయాంలో అంత అవినీతి జరిగి ఉంటే, వివేకా హత్యను ఆయనే చేయించి ఉంటే.తనపై కోడి కత్తి దాడి ఆయన పనే అయి ఉంటే.
జగన్ ఎందుకు నిరూపించలేకపోతున్నారన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న.