ఇటీవల భారత్ కు చెందిన 11 మంది ఉగ్రవాదుల వీడియోను ఐఎస్ఐఎస్ విడుదల చేయగా, అందులో ఇద్దరు తమిళనాడులోని కడలూరు ప్రాంతానికి చెందిన వారని తేలడంతో రాష్ట్ర పోలీసులు ఉలిక్కి పడ్డారు.తమిళనాడులో ఉగ్ర కార్యకలాపాలకు ప్లాన్ చేస్తున్న ఐఎస్ఐఎస్ ఇప్పటికే చాపకింద నీరులా విస్తరిస్తోందన్న అనుమానాన్ని కంద్ర నిఘా వర్గాలు హెచ్చరించిన నేపథ్యంలో కడలూరుకు చెందిన వారు ఉగ్రవాదుల్లో ఉన్నట్టు గుర్తించడం కలకలం రేపింది.
ఇక మరింత మంది ఉగ్రవాదులు లేదా వారి సానుభూతి పరులు ఉండవచ్చన్న ఉద్దేశంతో వారిని గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు.
ఈ వీడియోలో కనిపించిన యువకుల వివరాల కోసం ఆగమేఘాలపై విచారణ చేపట్టారు.
వీరు కడలూరు జిల్లా పరంగిపేట్టైకు చెందిన కాజా ఫక్రుద్దీన్ ఉస్మాన్ అలి, గుల్ ముహమద్ మరక్కాచ్చి మరకాయర్ గా గుర్తించిన పోలీసులు వారి కుటుంబీకులు ఇంకా అక్కడే ఉన్నారని గమనించి, వారిని ప్రశ్నిస్తున్నారు.వీరిద్దరిపై మలేషియాలో ఓ కేసు కూడా ఉందని తెలుస్తోంది.
ఈ ప్రాంతంలో గతంలోనే ఉగ్రమూలాలను పోలీసులు కనుగొన్నారు.పలువురు సిమీ ఏజంట్లను అదుపులోకి తీసుకున్నారు.
తాజా ఘటనలతో ఇక్కడి నుంచి విదేశాలకు వెళ్లిన వారందరి వివరాలనూ సమీకరించే పనిలో పోలీసులు ఉన్నారు.








