ఏపీ సిఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలు పోలిటికల్ హిట్ ను పెంచుతున్నాయి.వచ్చే ఎన్నికల్లో తాము ఒంటరిగానే పోటీ చేయబోతున్నామని, 175 స్థానాల్లో విజయం సాధిస్తామని జగన్ కాన్ఫిడెన్స్ వ్యక్తం చేశారు.
అంతే కాకుండా టీడీపీ జనసేన పార్టీలకు 175 స్థానాల్లో పోటీ చేసే దమ్ము ఉందా అంటూ సవాల్ కూడా విసిరారు.అయితే వైస్ జగన్ చేసిన ఈ సవాల్ వ్యూహాత్మకమైనదని కొందరి విశ్లేషకుల అభిప్రాయం.
వచ్చే ఎన్నికలు వైసీపీ కి ఎంతో కీలకం ఎందుకంటే ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ 175 స్థానాల్లోనూ విజయం సాధించాలనే టార్గెట్ పెట్టుకున్నారు.

“ వై నాట్ 175 ” అనే నినాదంతోనే ముందుకు పోతున్నారు.అయితే జగన్ నిర్దేశించుకున్న లక్ష్యం చేరుకోవడం అంతా సులువేమీ కాదు.ముఖ్యంగా టీడీపీ, జనసేన పార్టీల ప్రభావం గట్టిగా ఉంటుంది.
గతంతో పోలిస్తే జనసేన కూడా బాగా పుంజుకుంది.ఈ నేపథ్యంలో ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తే వైసీపీ ఓటు బ్యాంకు కు భారీగా గండి పడుతుంది.
అదే గనుక జరిగితే 175 స్థానాల్లో విజయం కాదుకదా తిరిగి అధికారంలోకి రావడం కూడా కష్ట తరమే.అందుకే వైసీపీ నేతలు పదే పదే టీడీపీ, జనసేన పొత్తు అంశాన్ని తెరపైకి తెస్తున్నారు.
ఈ రెండు పార్టీల మద్య పొత్తు కుదరక పోతే ఓట్ల చీలికతో వైసీపీకి లాభం చేకూరే అవకాశం ఉంది.

అందుకే వ్యూహాత్మకంగా టీడీపీ జనసేన పోటీ చేసే స్థానాలు చెప్పాలని, పొత్తు ను బహిర్గతం చేయాలని వైసీపీ నేతలు తరచూ విమర్శలు గుప్పిస్తుంటారు.అయితే టీడీపీ జనసేన పార్టీలు ఎన్ని స్థానాల్లో పోటీ చేయబోతున్నాయనేది ఇప్పటివరకు ఆ పార్టీ అధినేతలు ప్రకటించలేదు.రాబోయే రోజుల్లో ఈ రెండు పార్టీల మద్య పొత్తు కుదిరే అవకాశాలే ఎక్కువ.
ఈ నేపథ్యం వైఎస్ జగన్ నిర్దేశించుకున్న ” వై నాట్ 175 ” టార్గెట్ చేరుకోవడం కష్టమే.మరి జగన్ ఏ కాన్ఫిడెన్స్ తో 175 స్థానాల్లో విజయం సాధించాలనే టార్గెట్ పట్టుకున్నారో ఇప్పటికీ కూడా అంతుచిక్కని ప్రశ్నే.
మొత్తానికి 175 స్థానాల్లో పోటీ చేసే దమ్ముందా అని సవాల్ చేస్తూ.చంద్రబాబు, పవన్ లను డిఫెన్స్ లో పడేసే ప్రయత్నం చేస్తున్నారు ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డి.
మరి వైఎస్ జగన్ వ్యూహం ఎంతవరకు ఫలిస్తుందో చూడాలి.