వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం వివిధ దేశాలకు వలస వెళ్లిన భారతీయులు ఆయా దేశాల్లో కీలక స్థానాల్లో వున్న సంగతి తెలిసిందే.భారత సంతతి క్రమంగా పెరగడంతో అక్కడి వ్యవస్థలను శాసించే స్థాయికి చేరుకున్నారు .
ఉదాహరణకు అమెరికాను తీసుకుంటే ఈ గడ్డ మీదకు అడుగుపెట్టిన భారతీయులు క్రమంగా ఇక్కడి సమాజంలో కీలక స్థానాన్ని ఆక్రమించారు.అన్ని రంగాల్లో దూసుకెళ్తూ స్థానిక అమెరికన్లతో పాటు అగ్రరాజ్యంలో స్ధిరపడిన మిగిలిన విదేశీయులకు పోటీ ఇస్తున్నారు.
ఇక ఎన్నికల్లో భారతీయుల పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.పెన్సిల్వేనియా, జార్జియా, ఫ్లోరిడా, మిచిగాన్, టెక్సాస్, నార్త్ కరోలినా తదితర కీలక రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలో స్థిరపడిన ఇండో అమెరికన్లు అభ్యర్ధుల విజయాలను శాసిస్తున్నారు.
అందుకే వీరి కరుణ కోసం రిపబ్లికన్లు, డెమొక్రాట్లు తెగ తపిస్తుంటారు.ఈ పరిస్ధితి ఒక్క అమెరికాలోనే కాదు.దాని పొరుగునే వున్న కెనడాలోనూ వుంది.ఇక్కడ పెద్ద సంఖ్యలో స్థిరపడిన భారతీయులు అభ్యర్ధుల గెలుపొటములను శాసిస్తున్నారు.
ఇప్పటికే ఇక్కడ ఎంపీలు, కౌన్సిలర్లు, మేయర్లుగా, మంత్రులుగా ఇండో కెనడియన్లు రాణిస్తున్నారు.
తాజాగా కెనడాలో రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది.అధికార ‘‘ లిబరల్ పార్టీ ఆఫ్ కెనడా( Liberal Party of Canada )’’ కొత్త అధ్యక్షుడిగా భారత సంతతికి చెందిన సచిత్ మెహ్రా ( Sachit Mehra )ఎన్నికయ్యారు.పార్టీ సభ్యత్వాన్ని మెరుగుపరచడం, నిధుల సేకరణ, దేశవ్యాప్తంగా పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడం వంటి కార్యకలాపాలకు సచిత్ బాధ్యత వహిస్తారు.
శనివారం ఒట్టావాలో జరిగిన లిబరల్ పార్టీ మూడు రోజుల సమావేశాల ముగింపు రోజున పార్టీ అధ్యక్షుడిగా మెహ్రా ఎన్నికైనట్లు ప్రకటించారు.అంతర్గత ఎన్నికల్లో ప్రస్తుతం లిబరల్ పార్టీ వైస్ ప్రెసిడెంట్‌గా వున్న మీరా అహ్మద్‌ను( Mira Ahmad ) ఓడించి సచిత్ అధ్యక్షుడిగా విజయం సాధించారు.
ఇప్పటి వరకు సుజానే కోవాన్ ఈ పదవిలో వున్నారు.
సచిత్ మెహ్రా పూర్వీకులు ఢిల్లీకి చెందినవారు.1960వ దశకంలో ఆయన తండ్రి ఉన్నత విద్య కోసం కెనడాకు వచ్చి ఇక్కడే స్థిరపడిపోయారు.మానిటోబా ప్రావిన్స్‌లోని విన్నిపెగ్ నగరంలో సచిత్ పెరిగారు.
ఆయన వ్యాపారవేత్తగా రాణిస్తున్నారు.విన్నిపెగ్, ఒట్టావాలలో వున్న ఈస్ట్ ఇండియా రెస్టారెంట్స్‌ను ఆయన నడిపిస్తున్నారు.
కెనడాలోని ఫెడరల్ లిబరల్ ఏజెన్సీకి అధ్యక్షుడిగా, లిబరల్ పార్టీ ఆఫ్ కెనడా (మానిటోబా) అధ్యక్షుడిగా, యంగ్ లిబరల్స్ అధ్యక్షుడిగా సచిత్ పనిచేశారు.గతేడాది అక్టోబర్‌లో లిబరల్ పార్టీ అధ్యక్ష పదవికి తాను పోటీ చేస్తున్నట్లు మెహ్రా ప్రకటించారు.
భారతదేశాన్ని కోవిడ్ 19 సెకండ్ వేవ్ వణికించిన సమయంలో ఆక్సిజన్ సిలిండర్లు, ఇతర ఎక్విప్‌మెంట్లను ఇండియాకు పంపేందుకు సచిత్ నిధులను సేకరించారు.హిందీ, పంజాబీలలో ఆయన అనర్గళంగా మాట్లాడగలరు.2025 కెనడా ఫెడరల్ ఎన్నికల్లో లిబరల్ పార్టీని సచిత్ మెహ్రా నడిపించనున్నారు.