అమెరికాలో భారత సంతతికి చెందిన మహిళ చరిత్ర సృష్టించింది.ప్రతిష్టాత్మక హార్వర్డ్ లా రివ్యూ అధ్యక్షురాలిగా ఇండో అమెరికన్ అప్సరా అయ్యర్ ఎన్నికయ్యారు.ఈ సంస్థ 136 సంవత్సరాల చరిత్రలో అధ్యక్షురాలిగా ఎన్నికైన తొలి భారత సంతతి మహిళగా అప్సర రికార్డుల్లోకెక్కారు.2018 నుంచి ఆర్ట్ క్రైమ్‌తో పాటు స్వదేశానికి తిరిగి వచ్చే వారి గురించి ఆమె పరిశోధిస్తున్నారు.ఇప్పటి వరకు ఈ పదవిలో ప్రిస్కిలా కొరోనాడో వున్నారు.
యేల్ యూనివర్సిటీ నుంచి 2016లో ఆర్ధికశాస్త్రం, గణితం, స్పానిష్‌లలో బీఏ పట్టా అందుకున్నారు అప్సర.
క్లారెండన్ స్కాలర్‌గా ఆక్స్‌ఫర్డ్‌లో ఎంఫిల్ చదివిన ఆమె, 2018లో మాన్‌హట్టన్ డిస్ట్రిక్ట్ అటార్నీ యాంటిక్విటీస్ ట్రాఫికింగ్ యూనిట్ (ఏటీయూ)లో చేరారు.ఈ సంస్థలో ఆమె ఆర్ట్ క్రైమ్‌పై పరిశోధనలు చేశారు.15 వేర్వేరు దేశాలకు చెందిన దొంగిలించబడిన 1100కు పైగా కళాఖండాలను స్వదేశానికి తరలించడానికి అంతర్జాతీయ, ఫెడరల్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులతో అప్సర సమన్వయం చేసుకున్నారు.

అయ్యర్ 2020 చివరిలో హార్వర్డ్ లా స్కూల్‌లో చేరారు.అక్కడ ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ క్లినిక్‌లో విద్యార్ధిని, అలాగే సౌత్ ఏషియన్ లా స్టూడెంట్స్ అసోసియేషన్ సభ్యురాలు.చట్టవిరుద్ధంగా పురాతన వస్తువుల అక్రమ రవాణాకు వ్యతిరేకంగా పోరాడేందుకు గాను 2021-22లో హార్వర్డ్ లా స్కూల్ నుంచి సెలవు తీసుకుని డీఏ కార్యాలయానికి అప్సర తిరిగి వచ్చారు.
ఈ క్రమంలో అంతర్జాతీయ స్థాయిలో పురాతన వస్తువుల అక్రమ రవాణాపై పరిశోధన చేసి ఏటీయూ డిప్యూటీగా ఎదిగారు.

ఇకపోతే.1887లో నెలకొల్పబడిన ‘‘ది లా రివ్యూ’’కు అమెరికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు వుంది.అప్పటి ఫ్యూచర్ సుప్రీంకోర్ట్ న్యాయమూర్తి జస్టిస్ లూయిస్ డీ బ్రాండీస్ దీనిని స్థాపించారు.
ప్రపంచంలోని ఏ లా జర్నల్‌లోనూ లేనంత పెద్ద సర్క్యూలేషన్‌తో ఇది పూర్తిగా విద్యార్థుల సంపాదకీయంలో నడుస్తోంది.అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఈ జర్నల్ తొలి నల్లజాతి అధ్యక్షుడిగా వ్యవహరించారు.
