ప్రస్తుత సమాజంలో ప్రతి ఒక్కరూ కష్టపడకుండా లక్షలు వస్తాయి అంటే ముందు వెనక ఆలోచించకుండా అత్యాశకు పోయి భారీగా మోసపోతున్నారు.సోషల్ మీడియాలో, వార్త పత్రికలలో, న్యూస్ ఛానల్ లో భారీ మోసాల గురించి విన్నా కూడా ఆ క్షణంలో ఇవన్నీ గుర్తుకు రావు.
దీంతో భారీ మూల్యం చెల్లించుకుంటున్నారు కొందరు అత్యాశపరులు.ఇలాంటి కోవకు చెందిన వ్యక్తి అత్యాశకు పోయి రూ.50 లక్షలు మోసపోయాడు.దీనికి సంబంధించిన వివరాలు ఏమిటో పూర్తిగా చూద్దాం.

వివరాల్లోకెళితే.డాక్టర్.బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా( Dr.BR Ambedkar Konaseema District ) మండపేటకు చెందిన మాజేటి లక్ష్మీనారాయణ( Majeti Lakshminarayana ) కిరాణా వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు.అయితే ఓ వ్యక్తి రూ.50 లక్షల విలువైన రూ.500 నోట్లు ఇస్తే రూ.60 లక్షల విలువైన రూ.2000 నోట్లు ఇస్తున్నాడని ఓ స్నేహితుడు లక్ష్మీనారాయణకు చెప్పాడు.ఇక లక్ష్మీనారాయణ ముందుగా కాస్త ఆలోచనలో పడ్డాడు.ఇంతలో ఆ స్నేహితుడు సెప్టెంబర్ వరకు రూ.2000 నోట్లు మార్చుకోవడానికి సమయం ఉంది కదా.అంతలోపు మార్చుకునే అవకాశం ఉంటుంది అనడంతో లక్ష్మీనారాయణ లో అత్యాస మొదలైంది.ఒక్కసారిగా రూ.10 లక్షల లాభం వస్తుందని మురిసిపోయాడు.ఇక రూ.50 లక్షల రూ.500 నోట్లు ఇచ్చి రూ.60 లక్షల విలువైన రూ.2000 నోట్లు తీసుకునేందుకు సిద్ధమయ్యాడు.

లక్ష్మీనారాయణ గురువారం రాత్రి రూ.50 లక్షల విలువైన రూ.500 నోట్లను తీసుకొని కొంతమూరుకు వెళ్లాడు.అక్కడకు ఇద్దరు వ్యక్తులు వచ్చి లక్ష్మీనారాయణతో మాట్లాడుతూ ఉండగా ఇంతలో పోలీస్ సైరన్ వినిపించింది.క్షణాల్లో ఓ కారులో నకిలీ పోలీసులు అక్కడికి చేరుకున్నారు.ఆ కారులో ఉండే నలుగురు నకిలీ పోలీసులు లక్ష్మీనారాయణ బెదిరించి రూ.50 లక్షలు తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయారు.దీంతో లక్ష్మీనారాయణ తనను మోసం చేయడానికి ఇలా రూ.2000 నోట్ల వ్యవహారని పక్కాగా ప్లాన్ చేశారని గ్రహించాడు.శుక్రవారం ఉదయం తూర్పుగోదావరి జిల్లా రాజనగరం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు.సీఐ కాశీ విశ్వనాథన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.