రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యలను తక్షణమే పరిష్కరించకపోతే కలెక్టర్ రాష్ట్రంలో ఉన్న కలెక్టర్ ఆఫీసులన్నీ ముట్టడిస్తామని సిపిఐఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సి.హెచ్.
నర్సింగరావు ప్రభుత్వానికి హెచ్చరించారు.సోమవారం సిపిఐఎం విశాఖపట్నం జిల్లా కమిటీ చేపట్టే మహాధర్నాకు ప్రజలు ఇంటిపట్టాలు, ఇళ్లు, వ్యక్తిగత సమస్యలతో పెద్దసంఖ్యలో జిల్లా కలెక్టర్ ఆఫీస్‌కు తరలివచ్చారు.
ఈ సందర్భంగా నర్సింగరావు మాట్లాడుతూ విశాఖపట్నం జిల్లాలో ఇళ్ళ సమస్య పెద్ద సమస్యగా ఉందన్నారు.గత ప్రభుత్వాలు, ఈ ప్రభుత్వం పేదలకు ఇళ్లు కట్టించి ఇస్తామని పెద్దఎత్తున ప్రకటనలు చేస్తున్నప్పటికీ నేటికీ పేదలకు ఇంటికళ కలగానే మిగిలిపోయిందన్నారు.
తెలుగుదేశంలో హాయంలో నిర్మించిన హుదూద్ ఇళ్లు, జె.ఎన్.ఎన్.యు.ఆర్.ఎం ఇళ్లు, టిడ్కో గృహాలు నిర్మాణం జరిపి సంవత్సరాలు గడుస్తున్నా నేటికీ లబ్ధిదారులకు మంజూరు చేయకపోవడం శోచనీయమన్నారు.
వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వం అధికారంలోకి వస్తే పేదలందరికీ ఇళ్లు ఇస్తామని నేటికీ అర్హులకు పట్టాలు ఇవ్వలేదన్నారు.జగనన్న నీడ పేరుతో కొద్దిమందికి పట్టాలు పంపిణీచేసి రాష్ట్రవ్యాప్తంగా ఘనంగ ఇళ్లు నిర్మించి ఇస్తున్నామని మీటింగులు పెట్టి ఆర్భాటం చేస్తోందన్నారు.
ఇంకోవైపున సింహాచలం పంచగ్రామాల భూ సమస్య, గాజువాక ఇనాం భూసమస్యను పరిష్కరించకుండా గత ప్రభుత్వాల వలె నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు.ఇంకో రాష్ట్ర ప్రభుత్వం అర్భన్ ల్యాండ్ సీలింగ్ పేరుతో ప్రజలను దోచుకోవడానికి నోటీసులు ఇచ్చి ఇబ్బందులకు గురిజేసిందన్నారు.
జిల్లాలో కాలుష్య సమస్య తీవ్రంగా ఉన్నప్పటికీ అరికట్టడానికి ఎటువంటి చర్యలు తీసుకోకపోవడాన్ని తీవ్రంగా ఖండిరచారు.రేషన్‌కార్డులు, పెన్షన్లు, అమ్మఒడి, చేయూత, విద్యాదీవెన వంటి సంక్షేమ పథకాలను ఎదో ఒక పేరుతో రద్దుచేయడాన్ని తప్పుబట్టారు.
తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ప్రజాసమస్యలను పరిష్కారం చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు.సిపిఐఎం జిల్లా కార్యదర్శి ఎం.జగ్గునాయుడు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాసమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా వైఫల్యం చెందిందని ఆవేదన వ్యక్తం చేసారు.ప్రజలపైన భారాలు వేయడంలో ఉన్న శ్రద్ధ సమస్యలను పరిష్కరించడంలో చూపలేదని విమర్శించారు.
చెత్తపన్ను, మురుగునీటిపన్ను, ఆస్థిపన్ను, ఆర్టీసి చార్జీల పేరుతో ప్రజలపై భారాలు మోపి ప్రజల నడ్డివిరిచిందన్నారు.స్థానికంగా రోడ్లు, మెట్లు, రిటైనింగ్ వాల్స్ పాడై తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు.
స్కీం ఇళ్ళకు ఏడాదికి 41 రూ.లు వసూలు చేయాల్సి పోయి 760 నుండి 7000 రూ.లు వరుకు వసూలు చేస్తున్నారన్నారు.గ్రేటర్ విశాఖలో ప్రజా సమస్యలు తక్షణమే పరిష్కారం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సిపిఐఎం 78వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ బి.గంగారావు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బి.పద్మ, ఆర్.కె.ఎస్.వి.కుమార్, బి.ఈశ్వరమ్మ, కె.ఎం.శ్రీనివాస్, బి.జగన్, నాయకులు ఎం.సుబ్బారావు, పి.పైడిరాజు, ఎం.రాంబాబు, వి.నరేంద్రకుమార్, తదితరులు పాల్గొని నాయకత్వం వహించారు.