బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది.ఇది ఏపీ, దక్షిణ ఒడిశా తీరంలో మరికొన్ని గంటల్లో తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
ఈ అల్పపీడనం తెలుగు రాష్ట్రాలపై ప్రభావం చూపనుంది.
తీవ్ర అల్పపీడన ప్రభావంతో కోస్తాంధ్ర, యానాంలో విస్తారంగా వర్షాలు కురవనున్నాయని పేర్కొంది.
ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ పట్నంతో పాటు ఉభయగోదావరి జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు అధికారులు.అదేవిధంగా పలు ప్రాంతాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేసినట్లు ప్రకటించారు.
తీరం వెంబడి 40- 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని స్పష్టం చేశారు.ఈ క్రమంలో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించారు.
ఇప్పటికే, రెండు తెలుగు రాష్ట్రాల్లో గత మూడు రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.దీంతో పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి.
వాగులు, వంకలు పొంగి ప్రవాహిస్తున్నాయి.జలాశయాలు నిండుకుండలను తలపిస్తున్నాయి.
లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి.జనజీవనం అస్తవ్యస్థమవుతోంది.
చాలా చోట్ల రహదారులపైకి నీరు చేరడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.







