తాటి ముంజలు పరిచయం పల్లెల్లో వున్నవారికి అక్కర్లేదు.పట్టణాల్లో వున్నవారికి తప్పనిసరిగా కావాలి.
ఎందుకంటే వాటివలన ఈ వేసవికాలంలో అనేక ఉపయోగాలు వున్నాయి మరి.ఇక్కడ చాలామంది వేసవి తాపాన్ని తగ్గించుకునేందుకు పుచ్చకాయ, ఖర్బూజా తినడానికే ఎక్కవ మక్కువ చూపుతారు.అయితే వేసవిలో అత్యంత చలువ చేసేది, ఈ కాలంలో మాత్రమే దొరికేది తాటి ముంజలు మాత్రమే.గ్రామాల్లో తాటిచెట్లు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అక్కడ ముంజలు విరివిగా దొరుకుతుంటాయి.
అదే నగరాల్లో అయితే అవి దొరకడమే ఒకింత కష్టమనే చెప్పుకోవాలి.అయితే, వాటి విలువ తెలిసిన వారు ధర ఎంతైనా సరే కొనడం మాత్రం మానుకోరు.
తాటి ముంజలు వలన కలిగే లాభాలు:
ముఖ్యంగా తాటి ముంజల్లో విటమిన్ A, B, C, ఐరన్, జింక్, పాస్ఫరస్, పొటాషియం మొదలగు ఖనిజ లవణాలుంటాయి.ఇవి శరీరంలోని వ్యర్థ పదార్థాలను బయటికి పంపుతాయి.
తద్వారా శరీరం శుభ్రమై, తేలిక అవుతుంది.ముంజల్లో నీటిశాతం ఎక్కువగా ఉండటం వల్ల కొద్దిగా తిన్నా పొట్ట నిండినట్లుగా అనిపిస్తుంది.
దీంతో త్వరగా ఆకలి అనిపించదు.అందువలన బరువు తగ్గాలనుకునే వారికి ఇవి మంచి ఆహారం అని చెప్పుకోవచ్చు.
తాటి ముంజలకు ముఖ్యంగా శరీరాన్ని చల్లబరిచే గుణం అధికంగా ఉండటంతో వేసవిలో ఎంతో మేలు చేస్తాయి.ఎండ వల్ల కలిగే అలసట, నీరసాన్ని ఇవి దూరం చేస్తాయి.
అత్యంత ప్రమాదికారి అయిన మలబద్దకం సమస్యను నివారించడంలో ముంజలు బాగా పనిచేస్తాయి.వీటిని తరుచూ తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడి అజీర్తి, ఎసిడిటీ సమస్యలు మటుమాయం అవుతాయి.

అంతేకాకుండా, సౌందర్యం విషయంలోనూ తాటి ముంజలు ప్రధాన పాత్ర వహిస్తాయి.ముఖ్యంగా ఆడవారికి యుక్త వయస్సులో మొటిమలు సమస్యగా మారుతాయి.ఈ మొటిమలు తగ్గించడంలోనూ ముంజలు బాగా పనిచేస్తాయి. గర్భిణీ స్త్రీలకు ఇవి ఎంతో మేలు చేస్తాయి.పిండం ఎదుగుదల క్రమంలో వారి శరీర ఉష్ణాన్ని క్రమబద్దం చేస్తుంది.అలాగే మలబద్దకం వంటి సమస్యను నివారిస్తాయి.
కాబట్టి మనకు ఇంత మేలు చేసే తాటి ముంజలను ఈ వేసవిలో తినడం మాత్రం మిస్ కాకండి.