వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్ పూర్తిగా ఎన్నికల మూడ్ లోకి వెళ్లిపోయారు.2024 ఎన్నికల్లో గెలవడమే ఏకైక లక్ష్యంగా జగన్ పార్టీ శ్రేణులకు, ఎమ్మెల్యేలకు దిశా నిర్దేశం చేస్తున్నారు.రాబోయే ఎన్నికల్లో పూర్తిగా తనపైనే భారం వేసి ఎన్నికలకు వెళ్తానంటే కుదరదని వ్యక్తిగతంగా నియోజకవర్గంలో మంచి గుర్తింపు సంపాదించాలని, అలాగే సర్వేల్లోనూ మార్కులు ఆధారంగానే ఎమ్మెల్యే టికెట్ల కేటాయింపు జరుగుతుందని జగన్ మొహమాటం లేకుండా చెప్పేశారు.ఇక తమ రాజకీయ ప్రత్యర్థులు రోజురోజుకు బలం పెంచుకుంటూ తమకు అన్ని విషయాలలోను సవాల్ విసురుతూ ఉండడం పైన జగన్ సీరియస్ గానే ఉన్నారు.
 
ఈసారి 175 నియోజకవర్గాల్లోనూ గెలవాలనే లక్ష్యాన్ని పార్టీ శ్రేణులకు విధించారు.ఇక జగనన్నకు చెబుదాం పేరుతో నేరుగా ప్రజల సమస్యలను పరిష్కరించే విధంగా ఒక ప్రత్యేక ఫోన్ నెంబర్ ను కూడా ఏర్పాటు చేయబోతున్నారు.
సామాన్య ప్రజలకు మరింత దగ్గర అవ్వవొచ్చు అని, అలాగే లోటుపాట్లను సరి చేసుకోవచ్చని జగన్ భావిస్తున్నారు.ఇక క్షేత్రస్థాయిలో పార్టీ పైన ప్రభుత్వం పైన జనాలు ఏ విధంగా చర్చించుకుంటున్నారు మళ్ళీ అధికారంలోకి రావాలంటే ఏం చేయాలి ? ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు ఎంతవరకు అందుతున్నాయి ?  ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది ?  పార్టీలోని గ్రూపు రాజకీయాల్లో సంగతి ఏమిటి ? ఇలా అనేక అంశాలపై ఎప్పటికప్పుడు ప్రశాంత్ కిషోర్ టీం ద్వారా నివేదికలు తెప్పించుకుంటున్నారు.
 

అలాగే ఇంటిలిజెన్స్ వర్గాలు అందిస్తున్న రిపోర్టులను జగన్ పరిశీలిస్తున్నారు.ఇప్పటికే ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యే, పరిశీలకులు ఐపాక్ ప్రతినిధి , సోషల్ మీడియా వాలంటీర్ తో పాటు, సచివాలయం సిబ్బంది లబ్ధిదారులతో మమేకం అవుతూ, వారి సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నారు.వారి అభిప్రాయం ఏ విధంగా ఉందనేది ఫీడ్ బ్యాక్ తెలుసుకుంటున్నారు.అంతేకాదు స్వయంగా జగనే లబ్ధిదారులతో మాట్లాడి, వారి సమస్యలను తెలుసుకోవడంతో పాటు , ప్రభుత్వ పనితీరు ఏ విధంగా ఉందని ఫీడ్ బ్యాక్ స్వయంగా సాధారణ ప్రజల నుంచి తెలుసుకోవడం ద్వారా , వారికి మరింత దగ్గర అయ్యే ప్రయత్నాల్లో జగన్ ఉన్నారు.
మొత్తంగా 2024 ఎన్నికలే టార్గెట్ జగన్ భారీగానే ప్లాన్ చేస్తున్నారు.





 

