యాదాద్రి భువనగిరి జిల్లా: దీపం, ఉజ్వల పథకం గ్యాస్ వినియోగారులు ఈకేవైసి చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం చెప్పడంతో వినియోగదారులు గ్యాస్ ఏజెన్సీల చుట్టూ తిరుగుతున్నారు.దీనిని అదునుగా భావించిన గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు వినియోగదారుల నుంచి అక్రమంగా డబ్బులు వసూళ్లు చేస్తున్నారు.
కేవైసి కోసం వినియోగదారుల నుంచి ఎటువంటి రుసుము తీసుకోవద్దని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినా నిర్వాహకులు మాత్రం అదేమీ పట్టించుకోకుండా డబ్బులు వసూళ్లు చేస్తున్నారు.
ఒక్కో వినియోగదారుని నుంచి రూ.50 నుంచి రూ.100 వరకు వసూళ్లు చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి.ఇదేమిటని పలువురు ప్రశ్నిస్తే మాకు నిర్వహణ ఖర్చులు కూడా మిగలడం లేదని, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు డబ్బులు జమ చేసుకోవాలని వినియోగదారులను తిరిగి ప్రశ్నిస్తున్నారని సమాచారం.ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.







