టీఎస్పీఎస్సీ ఛైర్మన్ గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి( Mahender Reddy ) నియామకం అయ్యారు.ఈ మేరకు వారి నియామకానికి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆమోదం తెలిపారు.
మహేందర్ రెడ్డితో పాటు టీఎస్పీఎస్సీ( TSPSC ) బోర్డు సభ్యులుగా ఐదుగురు నియమితులయ్యారు.ఐఏఎస్ అనిత రాజేంద్ర, యాదయ్య, అమీర్ ఉల్లాఖాన్, వై రామ్మోహన్ రావు మరియు పాల్వాయి రజిని కుమారి టీఎస్పీఎస్సీ సభ్యులుగా బాధ్యతలు చేపట్టనున్నారు.
గత ప్రభుత్వంలో పని చేసిన ఛైర్మన్, సభ్యులు రాజీనామా చేసిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో టీఎస్పీఎస్సీ ప్రక్షాళన దిశగా అడుగులు వేసిన కాంగ్రెస్ ప్రభుత్వం( Congress Govt ) కమిషన్ ఛైర్మన్, సభ్యుల నియామకాలు భర్తీ చేయడానికి దరఖాస్తులను స్వీకరించింది.
ఇందులో భాగంగానే టీఎస్పీఎస్సీ చైర్మన్ గా( TSPSC Chairman ) మహేందర్ రెడ్డి పేరును ఖరారు చేసింది.
కాగా ఛైర్మన్ మహేందర్ రెడ్డితో పాటు ఐదుగురు సభ్యుల నియామకాలకు గవర్నర్ ఆమోదం తెలిపారు.ఐదేళ్ల పాటు టీఎస్పీఎస్సీ ఛైర్మన్ గా కొనసాగనున్న మహేందర్ రెడ్డి ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన వారు.ఆయన వరంగల్ ఎన్ఐటీ నుంచి సివిల్ ఇంజనీరింగ్ పట్టా తీసుకున్నారు.
ఉస్మానియా యూనివర్సిటీలో ఎంటెక్ చదువుతున్న సమయంలోనే ఐపీఎస్ కి సెలెక్ట్ అయ్యారు.ఈ క్రమంలోనే ఉమ్మడి కరీంనగర్ జిల్లా గోదావరిఖని ఏఎస్పీగా కెరీర్ ను ప్రారంభించారు.
తరువాత రాష్ట్ర డీజీపీగా( DGP ) కూడా విధులు నిర్వహించిన ఆయన ప్రస్తుతం టీఎస్పీఎస్సీ ఛైర్మన్ గా నియామకం అయ్యారు.