పెద్దపల్లిలో జరిగిన బహిరంగ సభలో తెలంగాణ ముఖ్యమంత్రి.గులాబీ బాస్ కేసీఆర్ ఒకమాటన్నారు.
దేశంలోని అనేక ప్రాంతాల నుంచి వచ్చిన రైతు సంఘాల నేతలు తనతో సమావేశమయ్యారట.ఆ సమయంలో రైతు సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ జాతీయ రాజకీయాల్లోకి ఖచ్చితంగా రావాలని కోరారట.
మీటర్లు లేని కరెంటు సరఫరా కోసం దేశమంతా తనకోసం ఎదురుచూస్తున్నట్లు ప్రతినిధులు తనతో చెప్పారని కేసీఆర్ చెప్పుకున్నారు.అంతమంది ప్రతినిధులు తనను జాతీయ రాజకీయాల్లోకి రావాలని అడుగుతున్నారని మరి జాతీయ రాజకీయాల్లోకి వెళదామా… అంటూ కేసీఆర్ అడగ్గానే జనాలంతా పోదాం.పోదాం.అంటూ నినాదాలిచ్చారు.అయితే ఇదంతా చూస్తుంటే కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెల్దామని గట్టిగానే ఫిక్స్ అయినట్లు అర్థమవుతోంది.
రైతు నేతలు ఒత్తిడి తెస్తున్నరు…!
వాస్తవానికి ఇప్పటికే ఎన్నో సార్లు ప్రయత్నాలు మొదలు పెట్టినా కాలం కలిసిరాక వెనకడుగు వేశారంతే.మొన్నటికి మొన్న బీఆర్ఎస్ అనే జాతీయ పార్టీ పేరు కూడా ప్రచారంలోకి వచ్చింది.అయితే రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో వెనక్కి తగ్గిన కేసీఆర్ ఇప్పుడు కొత్తగా రైతు సంఘాల ప్రతినిధులు కేసీఆర్ ను జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించాలని ఒత్తిడి పెడుతున్నట్లు చెప్పుకుంటున్నారు.
అందుకు కేసీఆర్ కూడా ఒప్పుకున్నట్లు కలరింగ్ ఇస్తున్నారంతే.ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే కేసీఆర్ తో భేటీ అయిన ప్రతినిధులంతా తమ రాష్ట్రాలకు తిరిగి వెళ్లిన తర్వాత మళ్లీ తమ తమ రాజకీయాల్లో పనుల్లో బిజీగా ఉంటారు.

ఇక ఈయన పార్టీ పెడితే వాళ్లు మద్దతు ఉంటుందో లేదో తెలియదు.పైగా రైతు సంఘాల ప్రతినిధులు మద్దతుగా నిలిచినంత మాత్రాన కేసీఆర్ కు సక్సెస్ కాలేరు.ఎందుకంటే నరేంద్రమోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ బిల్లులపై రైతు సంఘాలు ఎంత పెద్ద ఉద్యమం చేశాయో దేశమంతా తెలిసిందే.తర్వాత జరిగిన ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ఉద్యమ నేత రాకేష్ తికాయత్ ఉన్న యూపీ ప్రాంతంలో కూడా బీజేపీ స్వీప్ చేసేసింది.
పోలింగుకు ముందున్న వాతావరణమైతే తికాయత్ ఉన్న ప్రాంతంలోని సుమారు 128 స్థానాల్లో బీజేపీకి పెద్ద దెబ్బ పడుతుందనే అనుకున్నారంతా.కానీ పోలింగ్ జరిగిన తర్వాత ఫలితాల్లో చూస్తే బీజేపీనే మ్యాగ్జిమమ్ సీట్లు గెలుచుకుంది.
కాబట్టి రైతు ప్రతినిధులను కాకుండా ఆయా రాష్ట్రాల్లో ఉండే రాజకీయ పార్టీల మద్దతుంటేనే జాతీయ రాజకీయాల్లో రాణిస్తారని.లేకపోతే ఫలితం ఉండదనే వాదన వినిపిస్తోంది.