కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైంకర్ ఆదివారం చెక్ రిపబ్లిక్ రాజధాని ప్రాగ్‌లో భారత కమ్యూనిటీతో భేటీ అయ్యారు.ఈ సందర్భంగా స్వదేశంలో ప్రస్తుత పరిణామాలు, ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల గురించి చర్చించారు.
ఐరోపా దేశాలతో భారత్ సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు గాను స్లోవేకియా, చెక్ రిపబ్లిక్‌లలో ఎస్ జైశంకర్ పర్యటించారు.
ఈ సందర్భంగా ఆయన ట్విట్టర్ ద్వారా స్పందించారు.
ప్రాగ్‌లోని భారతీయ సమాజాన్ని కలవడం ఆనందంగా వుందన్నారు.ఇక్కడ మన కమ్యూనిటీ విస్తరణ కూడా ప్రోత్సాహకరంగా వుందని జైశంకర్ పేర్కొన్నారు.
భారత్‌లో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు, మన ద్వైపాక్షిక సంబంధాల స్థితిగతులను వారితో పంచుకున్నట్లు కేంద్రమంత్రి పేర్కొన్నారు.ఎస్ జైశంకర్ శనివారం స్లోవేకియా రాజధాని బ్రాటిస్లావా నుంచి ప్రాగ్ చేరుకున్నారు.
పర్యటనలో భాగంగా ఆదివారం చెక్ రిపబ్లిక్ ఆర్ధిక మంత్రితో భేటీ అయ్యారు.ఈ ఏడాది జూలై 1 నుంచి చెక్ రిపబ్లిక్ యూరోపియన్ యూనియన్ అధ్యక్ష పదవిని చేపట్టనుంది.
అధికారిక గణాంకాల ప్రకారం.దాదాపు 5000 మంది భారతీయ పౌరులు చెక్ రిపబ్లిక్‌లో నివసిస్తున్నారు.వీరిలో ఎక్కువగా ఐటీ నిపుణులు, వ్యాపారవేత్తలు, విద్యార్ధులే.అక్కడి ఇండియన్ ఎంబసీతో కలిసి కమ్యూనిటీ ఈవెంట్‌లను నిర్వహించే భారతీయులు, భారత సంతతి సంఘాలు అనేకం చెక్ రిపబ్లిక్‌లో వున్నాయి.
ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర నేపథ్యంలో మాస్కోపై కఠినమైన వైఖరిని తీసుకోవాలని భారత్‌పై పలు యూరోపియన్ దేశాలు ఒత్తిడి చేస్తున్నాయి.ఈ నేపథ్యంలో జైశంకర్ ఐరోపా పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది
.