రాజన్న సిరిసిల్ల జిల్లా : కోర్టు కేసుల్లో నేరస్తులకు శిక్ష పడేలా చేయడం,శిక్షల శాతాన్ని పెంచడం ద్వారా సమాజంలో మంచి మార్పు తీసుకురావచ్చని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు.శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో కోర్ట్ విధులు నిర్వహించే పోలీస్ అధికారులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ….న్యాయాధికారులతో సమన్వయం పాటిస్తూ నేరస్థులకు ఖచ్చితంగా శిక్ష పడేవిధంగా ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలని సూచించారు.
నిరంతరం పెండింగ్లో ఉన్న కేసుల పురోగతిని పరిశీలిస్తూ, ఉన్నతాధికారుల సలహాలు,సూచనలు పాటిస్తూ కేసుల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు.సాంకేతికత ప్రస్తుత రోజుల్లో కీలకంగా మారిందని అన్ని కేసుల్లో సైంటిఫిక్ ఆధారాలు కచ్చితంగా జమ చేయాలన్నారు.
కోర్టు కేసులకు సంబంధించిన ప్రధాన కేసుల్లో నిందితులకు జీవిత ఖైదుపడేలా కృషి చేయాలని శిక్షల శాతం పెరిగేలా పనిచేసే అధికారులను సిబ్బందికి రివార్డులు అందజేయడం జరుగుతుందని తెలిపారు.
ప్రాసిక్యూషన్ లో భాగంగా కోర్ట్ వారు జారీ చేసిన నాన్ బేలబుల్ వారెంటులను క్రమం తప్పకుండా అమలు పరిచి నేరస్తులకు శిక్షలు పడేవిధంగా కృషిచేసి కన్విక్షన్ రేటును పెంచాలని అన్నారు.
కోర్టు కేసుల్లో నిందుతులకు శిక్షలు పడినప్పుడే నేరాల నియంత్రణ సాధ్యమవుతుందని, ఇందుకు అనుగుణంగా కేసులు పెండింగులో లేకుండా చూసుకోవాలని సూచించారు.నేరస్తులకు శిక్షలు పడేలా పని చేయడంలో సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారితో పాటు కోర్టు డ్యూటీ సిబ్బందికి చాలా బాధ్యత ఉంటుందని చెప్పారు.
కోర్టు విధులకు సంబంధించి పక్కా కార్యాచరణ ప్రణాళికను అవలంభించాలన్నారు.ఈ సమావేశంలో సి.ఐ కిరణ్ కుమార్, కోర్ట్ డ్యూటీ అధికారులు పాల్గొన్నారు.







