మళ్లీ యాక్టీవ్ అవుతున్న ట్రంప్.. సెనేట్ ఎన్నికలపై పావులు, మద్ధతుదారులతో చర్చలు

అమెరికాలో అధ్యక్ష అభ్యర్థిగా బరిలో దిగి ఓడిపోయినవారు ఆ తర్వాత పెద్దగా లైమ్ లైట్‌లో ఉండరు.మీడియా సైతం వారిని అంతగా పట్టించుకోదు.

అలాగే మాజీ అధ్యక్షులు సైతం బయట కనిపించడానికి కూడా పెద్దగా ఇష్టపడరు.అధ్యక్షుడిగా ఉండి.

పోటీకి దిగి పరాజయం పాలైనవారిదీ ఇదే పరిస్థితి.కానీ, డొనాల్డ్‌ ట్రంప్‌ స్టైలే వేరు.బైడెన్‌ చేతిలో ఓటమిపాలు కావడంతో ట్రంప్‌ రాజకీయాల్లో కొనసాగుతారా? లేక వ్యాపారాల్లోకి తిరిగి ప్రవేశిస్తారా అంటూ వస్తున్న అనుమానాలకు ఆయన ఎప్పుడో చెక్ పెట్టేశారు.2024లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పి ఆయన తన స్టాండ్ ఏంటో చెప్పారు.అలాగే బైడెన్ తీసుకుంటున్న నిర్ణయాలపై తనదైన శైలిలో విమర్శలు చేస్తూ వస్తున్నారు.

మెక్సికో గోడ నిర్మాణాన్ని రద్దు చేయడం, వీసా విధానాలు, సరిహద్దుల్లో అక్రమ వలసదారులను దశలవారీగా అనుమతిస్తూ బైడెన్ తీసుకున్న నిర్ణయాన్ని ట్రంప్ తప్పుబట్టారు.అధ్యక్షుడి చర్యల వల్ల దేశ భద్రత ప్రమాదంలో పడుతుందంటూ ఆరోపించారు.

Advertisement

తాజాగా అమెరిక‌న్ సెనేట్‌లో రిపబ్లికన్లు మెజార్టీ సాధించేందుకు ట్రంప్ ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేశారు.మద్దతుదారులలో కింగ్ మేకర్‌గా తన పాత్రను పరిచయం చేసుకున్న ఆయన.వచ్చే ఏడాది సెనేట్‌కు జరుగ‌నున్న‌ ఎన్నికలలో రిపబ్లికన్లు విజయం సాధించాలని తద్వారా సెనేట్‌లో పూర్తి మెజారిటీ పొందాలని ట్రంప్ తన మద్ధతుదారులకు సూచించారు.ఈ మేరకు ఫ్లోరిడాలోని తన పామ్ బీచ్ మార్-ఎ-లాగోలో జరిగిన పార్టీ స‌మావేశంలో నేతలకు, మద్ధతుదారులకు దిశానిర్దేశం చేశారు.

ఈ స‌మావేశానికి రిపబ్లికన్ జాతీయ కమిటీ నుంచి ప‌లువురు సీనియ‌ర్ నేత‌లు, పార్టీకి డోనర్స్‌గా వ్యవహరిస్తున్న వారు హాజరయ్యారు.రిపబ్లికన్ పార్టీ భవిష్యత్తును నిర్ణయించడానికి మనం ఇక్కడ స‌మావేశ‌మ‌య్యామని ట్రంప్ అన్నారు.2022 ఎన్నికల్లో అత్యధిక సంఖ్యలో సెనేట్ సీట్లు గెలవడమే మ‌న ముందున్న‌ లక్ష్యమ‌న్నారు.ఈ సమావేశంలో 2024 అధ్యక్ష ఎన్నికల ప్రస్తావన తీసుకురాలేదు ట్రంప్.

కాగా, 2024 అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలని ట్రంప్ వద్ద విదేశాంగ శాఖ కార్యదర్శిగా పనిచేసిన మైక్ పాంపియో, ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిశాంటిస్ సహా పలువురు రిపబ్లికన్లు ప్రయత్నిస్తున్నట్లుగా సమాచారం.రాబోయే రోజుల్లో ఈ లిస్ట్ మరింత పెరిగే అవకాశం లేకపోలేదు.

అందివచ్చిన అవకాశాన్ని ఈ ఇద్దరు హీరోయిన్స్ ఉపయోగించుకుంటారా ?
Advertisement

తాజా వార్తలు