రాజన్న సిరిసిల్ల జిల్లా ఆసుపత్రిలో వైద్య సేవలు ఎలా ఉన్నాయి.? డాక్టర్లు, సిబ్బంది వైద్యం బాగానే చేస్తున్నారా? అంటూ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా స్వయంగా వైద్య చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడి వైద్య సేవల తీరుపై ఆరా తీశారు.బుధవారం వేములవాడ ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసి, ఆసుపత్రి లోని అన్ని విభాగాలను, రోగులకు సేవలు అందిస్తున్న తీరును క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.
ఔట్ పేషెంట్ విభాగాలను, ల్యాబ్, ఐపి వార్డు, ఫార్మసీ, పిడియాట్రిక్ వార్డు, ఐసీయూ, ఎం.ఐ.సీ.యూ.విభాగాలను పరిశీలించి, ప్రతి రోజూ ఎంత మంది పేషెంట్లు వస్తున్నారు? ఎంత మంది జ్వరంతో వస్తున్నారు? ఎంత మందికి పరీక్షలు చేస్తున్నారు? అనే వివరాలను ఆసుపత్రి పర్యవేక్షకులు డా.పెంచలయ్య ను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.ఐపి వార్డులో జ్వరంతో చికిత్స పొందుతున్న రోగులతో కలెక్టర్ స్వయంగా మాట్లాడి ఆసుపత్రిలో సేవలు ఎలా ఉన్నాయి అనే వివరాలను ఆరా తీశారు.
ఎక్కడి నుంచి వచ్చారు? ఆసుపత్రికి వచ్చిన ఎన్ని రోజులు అవుతుంది అని ఆప్యాయంగా అడిగి తెలుసుకున్నారు.విష జ్వరాలు, డెంగ్యూ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు.ల్యాబ్, కంటి పరీక్షలు, దంత వైద్య, డీ.ఈ.ఐ.సీ విభాగాలను తనిఖీ చేశారు.ఉత్తమ వైద్య సేవలను అందించాలని కలెక్టర్ కోరారు.
తనిఖీలో జిల్లా వైద్యాధికారి డా.వసంతరావు, పర్యవేక్షకులు డా.పెంచలయ్య, ఆర్ఎంఓ డా.సంతోష్ చారీ, డా.దీప్తి, డా.అనిల్, తదితరులు ఉన్నారు.