తమ ఫోన్ ట్యాపింగ్ కి గురవుతుందేమో అన్న అనుమానం ప్రముఖులందరిలోనూ ఉంటుంది.అందుకే ఫోన్ లో ఏదైనా కీలక విషయాలు గురించి మాట్లాడుకోవాలంటే కొంచెం భయపడుతుంటారు.
ఇక రాజకీయ నాయకుల సంగతి అయితే చెప్పాల్సిన అవసరం లేదు.తరుచు తమ ఫోన్ లు అధికార పార్టీ ట్యాపింగ్ చేస్తోంది అంటూ ప్రతిపక్షానికి చెందిన నాయకులంతా అంటూనే ఉంటారు.
ఈ మధ్యకాలంలో తెలుగు రాష్ట్రాల్లో ఫోన్ ట్యాపింగ్ వివాదం ఎంత సంచలనం సృష్టించిందో తెలియంది కాదు.తాజాగా దేశంలో ఫోన్ ట్యాపింగులకు సంబంధించి ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది.

వినియోగదారుడు కోరితే ఫోన్ ట్యాపింగ్ సమాచారాన్ని బయట పెట్టాల్సిందేనని తీర్పునిచ్చింది.ఒకవేళ టెలిఫోన్ కంపెనీలు ఇవ్వడానికి నిరాకరిస్తే.టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ఇవ్వాలని ఆదేశించింది.సమాచార హక్కు చట్టాన్ని ఉపయోగించి ట్రాయ్‌ను ట్యాపింగ్ సమాచారాన్ని కోరవచ్చని ఉన్నత న్యాయస్థానం తన ఆదేశాల్లో తెలిపింది.
ఢిల్లీకి చెందిన కబీర్ శంకర్ బోస్ అనే న్యాయవాది వేసిన పిటీషన్‌పై జరిగిన వాదనల అనంతరం ఢిల్లీ హైకోర్టు ఈ తీర్పు వెలువరించింది.