తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి( Revanth Reddy ) ఉచిత విద్యుత్ అంశంపై చేసిన వ్యాఖ్యలు పెద్ద రాజకీయ దుమారం రేపిన నేపథ్యంలో ఆ వ్యాఖ్యలను తమకు అనుకూలంగా మార్చుకుని కాంగ్రెస్ పై ప్రజలలోను వ్యతిరేకత పెంచే విధంగా చేయాలనే వ్యూహంతో బిఆర్ఎస్ రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ వ్యాఖ్యలకు నిరసనగా ఆందోళన కార్యక్రమాలకు నిన్న పిలుపునిచ్చింది.రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలు, అన్ని నియోజకవర్గాల్లో ఈ ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని బీఆర్ఎస్ పిలుపునివ్వడం, దానికి తగ్గట్లుగానే ఎక్కడికక్కడ ఈ కార్యక్రమాలు జరిగాయి.
అయినా ఆశించిన స్థాయిలో అయితే ఈ కార్యక్రమం సక్సెస్ కాలేదనే అభిప్రాయం బీఆర్ ఎస్ అగ్ర నేతల్లో కలిగింది.దీనికి తోడు మీడియా కవరేజ్ కూడా పెద్దగా లేదని, గతంలో మాదిరిగా ఈ కార్యక్రమం ఎందుకు సక్సెస్ కాలేదనే అభిప్రాయంతో బీఆర్ఎస్ అగ్ర నేతలు ఉన్నారు.
వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే గట్టి ఎక్కిస్తాయని బీఆర్ఎస్( BRS party ) సిట్టింగ్ ఎమ్మెల్యేలు, మంత్రులు ఆశలు పెట్టుకున్నారు.అయితే అనూహ్యంగా కాంగ్రెస్ బలం పెంచుకోవడం, చేరికలతో మంచి ఊపు మీద ఉండడంతో, రేవంత్ చేసిన ఉచిత కరెంట్ అంశాన్ని తమకు అనుకూలంగా మార్చుకున్నారు.దీని ద్వారా రైతుల్లో సెంటిమెంటును రగిలించి రాజకీయంగా మైలేజ్ పొందాలనే ఆలోచనతో బీఆర్ఎస్ ఈ నిరసన కార్యక్రమాలు చేపట్టింది.అయితే ఈ కార్యక్రమంలో సగం మంత్రులు పాల్గొనకపోవడం , హైదరాబాదులోనే వీరంతా ఉండిపోవడంతో, జిల్లాలోని నేతలు ఉత్సాహంగా ఈ కార్యక్రమాలను నిర్వహించలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇక హైదరాబాదులో జరిగిన ఆందోళన కార్యక్రమంకు మీడియా కవరేజ్ లభించినా, జిల్లాల్లో జరిగిన కార్యక్రమాలకు పెద్దగా మీడియా ఫోకస్ లభించకపోవడానికి కారణాలు ఏమిటి ? మీడియా వైఖరిలో ఎందుకు మార్పు వచ్చింది ? దీనికి కారణాలు ఏమిటి అనే విషయాల పైన బీఆర్ఎస్ దృష్టిపెట్టింది.ఇక ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే దానం నాగేందర్ విద్యుత్ సౌధ ముందు చేసిన ధర్నాకు భారీ సంఖ్యలో కార్యకర్తలు హాజరైనా, కవిత ( kavitha )మాట్లాడిన సమయంలో మీడియా లైవ్ కవరేజ్ ఇచ్చినా, మిగిలిన కార్యక్రమాన్ని పట్టించుకోకపోవడం వంటి విషయాలపైన బీఆర్ఎస్ విశ్లేషణ చేసుకుంటున్నట్లు సమాచారం.మొత్తంగా అనుకున్న స్థాయిలో అయితే ఈ కార్యక్రమం సక్సెస్ కాలేదు అనే అభిప్రాయం పార్టీ అగ్ర నేతల్లో కలిగిందట.
.